షర్మిల స్కెచ్ సక్సెస్ అవుతుందా..?

Update: 2021-08-22 10:18 GMT
తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు చేస్తానన్న వైఎస్ షర్మిల కల నెరవేరనుందా..? రాష్ట్రంలో వాడీవేడిగా సాగుతున్న రాజకీయ పోరులో వైఎస్సార్సీపీ నెగ్గగలదా..? ఇప్పటికీ వైఎస్ షర్మిల తప్ప సీనియర్ నాయకులు కనిపించని ఆ పార్టీలో ఉన్న వారు బయటికి వెళ్తున్నారు. ఈ తరుణంలో ఆమె మిగతా పార్టీల పోటీ నుంచి తట్టుకోగలదా..? ఎన్నటికీ నెరవేరని ఉద్యోగాల లక్ష్యాన్నిముందుంచుకున్న షర్మిల తాను అనుకున్నది నెరవేర్చగలరా..? నిరుద్యోగులు ఎంతో మంది ఉన్న రాష్ట్రంలో షర్మిల పార్టీ వెంట వచ్చే వారెందరు..? వైఎస్సార్సీపీ చూసి భయపడే పార్టీ ఏదీ..? ఈ ప్రశ్నలపై ఈ పార్టీలో ఉన్నవారు, బయటివారు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

ఈ ఏడాది జూలైలో షర్మల కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.  పార్టీ ప్రకటన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని షర్మిలతో పాటు పార్టీ నాయకులు దీక్షల  చేస్తున్నారు. షర్మిల ప్రతి జిల్లాలో పర్యటిస్తూ నిరుద్యోగులను కలుస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఆమె పార్టీ పనిచేస్తుందని తెలుపుతోంది. దీంతో పార్టీ ప్రారంభించిన కొత్తలో షర్మిల పార్టీలోకి వెళ్లేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

హూజూరాబాద్ లో ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ పోటీపోటీగా ప్రచారం చేస్తోంది.మరోవైపు కాంగ్రెస్ కూడా తన పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో నియోజవర్గంలో ఉద్యోగం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతోషర్మిల హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సమయంలో కొందరు ఇక్కడ పోటీ చేస్తారా..? అని అడిగారు. దీంతో ఆమె పోటీ చేయనని తేల్చింది.

వైఎస్సార్సీపీ పార్టీ ప్రారంభించకముందు నుంచే టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న షర్మిల ఆ తరువాత దూకుడు పెంచారు. కేసీఆర్, కేటీఆర్ లపై సెటైర్లు వేస్తూ ఆకట్టుకున్నారు. దీంతో కారు పార్టీ నాయకులు షర్మిల ప్రభావం పార్టీపై ఉంటుందా..? అని మదన పడ్డారు. అయితే ఆ తరువాత హుజూరాబాద్లో టీఆర్ఎస్ హవా సాగిస్తోంది. దీంతో వైఎస్సార్సీపీ ఆ నియోజవవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేయలేదు. అయితే ఇటీవల ఆమె నియోజకవర్గంలో పర్యటించిన తరువాత అక్కడ తమ పార్టీ ఉనికిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. మొదట  ఎవరైనా నిరుద్యోగి పోటీ చేస్తే తాము మద్దతిస్తామని అనుకున్నారు. అయితే అలా చేయడం వల్ల పార్టీకి పెద్దగా గుర్తింపు రాదని కొందరు సూచించారట.  

దీంతో వెయ్యి మంది నిరుద్యోగులతో నామినేషన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఉద్యోగాలు కల్పించడం కోసం నిరుద్యోగుల తరుపున పోరాడుతున్న షర్మిల ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో పెద్ద మొత్తంలో నామినేషన్లు వేస్తే ప్రభుత్వంలో కదలిక వచ్చి ఉద్యోగాల విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పార్టీ కోసం నామినేషన్లు వేసేవారు ఎంత మంది వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే పార్టీలో సీనియర్లు లేరన్న టాక్ ఉంది. ఇక తాజాగా పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ రాజీనామా చేసి సొంతగూటికి వెళ్లారు. దీంతో పార్టీ మనుగడపై కొందరిలో భయం పుట్టుకుంది. పార్టీ ప్రారంభలోనే ఇంతలా ఉంటే రాను రాను పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. అయితే 2023 లక్ష్యంగా చేసుకొని పార్టీ ప్రతిష్టతకు కృషి చేస్తామని షర్మిల ఇదివరకే ప్రకటించారు. అయితే హుజూరాబాద్ ఉప  ఎన్నికను లెక్కకు తీసుకోకపోయినా అక్కడ పార్టీని పరిచయం చేసేందుకు నిరుద్యోగులతో నామినేషేన్లు వేయించాలని అనుకుంటున్నారట. మరి షర్మిల వ్యూహం ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి.
Tags:    

Similar News