ఎదురుపడనున్న జగన్, షర్మిల.. ఏం జరుగనుంది?

Update: 2021-07-05 13:38 GMT
వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు.. దారులు వేరైనా రక్తం ఒక్కటే.. ఒకే తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఒకరేమో ఏపీలో సీఎంగా ఉండగా.. మరొకరు ఏమో తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టబోతున్నారు. జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు జగన్, షర్మిల ఒకేచోట కలుసుకోబోతున్నారు. అన్నకు ఇష్టం లేకుండా బయటకొచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిలను అన్న జగన్ కరుణిస్తాడా? ఆదరిస్తాడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా  జులై 8న వైఎస్ షర్మిల తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేశారు. సభకు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది.

 జులై 8న వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపుల పాయకు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు షర్మిల అక్కడ వైఎస్ఆర్ ను నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వేన్షన్ చేసుకొని  5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన.. జెండాను ఆవిష్కరిస్తారు. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాను తెలంగాణ మ్యాప్ తోపాటు వైఎస్ఆర్ చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. 80శాతం పాలపిట్ట రంగు.. 20శాతం నీలిరంగు ఉంటుంది. మొదట 8న పార్టీ ఆవిర్భావం వేళ వైఎస్ఆర్ విగ్రహాలు సిద్ధం చేసి నివాళులర్పించాలని వైఎస్ షర్మిల తొలి పిలుపు ఇచ్చారు.

ఇక తన తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ టూర్ కూడా ఖరారైంది. జగన్ 7,8,9 వ తేదీల్లో కడప, అనంతపురం పర్యటనలు పెట్టుకున్నాడు. 7వ తేదీన ఇపుడుపాలయకు వచ్చి బస చేస్తారు. 8న ఇడుపుల పాయలో తండ్రికి నివాళులర్పిస్తారు. అదే సమయానికి షర్మిల కూడా అక్కడికి రాబోతోంది. దీంతో అన్నాచెల్లెలు పలకరించుకుంటారా? మునుపటి బంధం ఉంటుందా? ఉండదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

అన్న జగన్ ను కాదనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని ప్రచారం సాగుతోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ‘జగన్ కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెడుతున్నారని.. వద్దని వారించారని’ అప్పట్లో చెప్పారు. ఇక సాక్షి మీడియాపై కూడా తెలంగాణలో ధర్నా సందర్భంగా కవరేజ్ ఇవ్వడం లేదని షర్మిల మండిపడ్డారు. దీన్ని బట్టి అన్న జగన్ తో షర్మిలకు దూరం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్, షర్మిల తీరు ఎలా ఉండబోతోందన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News