1999-2004లో బాబు, ఇప్పుడు జ‌గ‌న్‌... 2024లో ఈ ఫార్ములా స‌క్సెస్ అవుతుందా?

Update: 2021-05-24 15:30 GMT
2019 ఎన్నికల‌కు సంబంధించిన విశ్లేష‌ణ‌ల‌కు అప్పుడే చెల్లుచీటి ప‌డిపోయింది. ఇప్పుడంతా ఇంకో మూడేళ్ల త‌ర్వాత జ‌రిగే 2024 ఎన్నిక‌ల‌కు గురించిన విశ్లేష‌ణ‌లదే అగ్ర‌పీఠం. 2024 ఎన్నిక‌ల తీరు ఎలా ఉండ‌నుంది? ఎవ‌రు విజ‌యం సాధిస్తారు? ఏ ఈక్వేష‌న్లు ప‌నిచేయ‌నున్నాయి? మ‌రోమారు జ‌గ‌న్ సీఎం అవుతారా?  లేదంటే 2004లో చంద్ర‌బాబు మాదిరిగా బోల్తా కొట్టేస్తారా? టీడీపీ ప‌రిస్థితి ఏమిటి?... ఇలా లెక్క‌లేన‌న్ని విశ్లేష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.  వీట‌న్నింటిలో కంటే 2004లో చంద్ర‌బాబు ఎలాగైతే అప‌జ‌యం పాల‌య్యారో... ఆ మాదిరిగానే ఇప్పుడు జ‌గ‌న్ కూడా సొంత పార్టీ నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేసి... అధికార యంత్రాంగంపై ఆధార‌ప‌డిన నేపథ్యంలో అప‌జ‌యం బాట ప‌డ‌తారా? అన్న ఈక్వేష‌న్ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

1995లో సీఎంగా అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు... 1999లో బీజేపీతో జ‌త‌క‌ట్టి గెలుపు బాట ప‌ట్టారు. అంతేకాకుండా నాడు కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజ‌కీయాలు కూడా చంద్ర‌బాబుకు సునాయ‌స గెలుపును అందించాయి. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు... తొలి టెర్మ్‌లో మాదిరిగా కాకుండా సెకండ్ టెర్మ్ లో త‌న‌దైన శైలి పాల‌న‌కు శ్రీకారం చుట్టారు. పార్టీకి చెందిన కీల‌క నేత‌లు, త‌న కేబినెట్ లోని మంత్రుల‌కంటే కూడా అధికార యంత్రాంగానికి పాల‌నా ప‌గ్గాలు అప్ప‌గించి పార్టీ నేత‌ల‌పై శీత‌క‌న్నేశారు. ఈ త‌ర‌హా ప‌రిణామం పార్టీ శ్రేణుల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తిని ర‌గిలించింది. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌ని చంద్ర‌బాబు... 2004 ఎన్నిక‌ల్లో కూడా నేత‌ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా త‌న‌కు న‌చ్చిన అధికారుల‌ను వెంటేసుకుని ఎన్నిక‌ల వ్యూహాల‌ను ర‌చించారు. వెర‌సి చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బే ప‌డింది.

అంతేకాకుండా నాడు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర జ‌నాల్లోకి బాగా వెళ్లింది. నేత‌ల‌కు, క్షేత్ర‌స్థాయిలోని నేత‌లు, పార్టీకి చెందిన కీల‌క నేత‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌కు పెద్ద పీట వేశారు. దీంతో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన వైఎస్‌... చంద్రబాబు తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆ త‌ర్వాత త‌న పాల‌న‌లో వైఎస్‌... అధికార యంత్రాంగం కంటే కూడా త‌న వెంట న‌డిచిన నేత‌ల‌కు, ఆయా ప్రాంతాల్లోని నేత‌లు, త‌న కేబినెట్ లోని స‌హ‌చ‌రుల‌కు పెద్ద పీట వేశారు. ఫ‌లితంగా 2009 ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా రెండోసారి గ్రాండ్ విక్ట‌రీ కొట్టేసి కాంగ్రెస్ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి నాందీ ప‌లికారు. ఇక 2019 ఎన్నికల్లో వైఎస్ ఫార్మూలానే అస‌రా చేసుకుని ముందుకు సాగిన ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర‌తో జ‌నంతో మ‌మేక‌మ‌య్యారు. వెర‌సి తొలి విక్ట‌రీ కొట్టేశారు. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు అనుస‌రించిన విధానాల‌ను తూర్పార‌బ‌ట్టిన జ‌గ‌న్ ఈజీగానే విజ‌యం అందుకున్నారు.

ఇక ప్ర‌స్తుత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌నా తీరును ప‌రిశీలిస్తే... నాడు 1999-2004 మ‌ధ్య చంద్ర‌బాబు సాగించిన పాల‌నా తీరు సూచ‌న‌లు చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. త‌న పార్టీ టికెట్ల‌పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌... ప్ర‌తి విష‌యంపై అధికార యంత్రాంగంపైనే ఆధార‌ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిపై ఇప్ప‌టికే  వైసీపీ ఎమ్మెల్యేలు, శ్రేణుల్లో అసంతృప్తి చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. పాల‌నకు సంబంధించి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో త‌మ‌నేమీ భాగ‌స్వాముల‌ను చేయ‌కుండా ప్ర‌తిదానికి అధికారుల‌నే జ‌గ‌న్ ఆశ్ర‌యిస్తున్న వైనంపై పార్టీ శ్రేణులు ఓ ర‌క‌మైన నిరాశా నిస్పృహ‌ల్లో కొట్టుమిట్టాడుతున్నాయ‌నే చెప్పాలి. అస‌లు ఆయా నిర్ణ‌యాల్లో, జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల్లో త‌మ‌ను భాగ‌స్వాముల‌ను చేయ‌కుంటే... జ‌నంలోకి తామెలా వెళ్లేది అన్న భావ‌న‌తో వైసీపీ నేత‌లు... ప్ర‌త్యేకించి ఎమ్మెల్యేలు మ‌థ‌న‌ప‌డుతున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి నాడు 2004లో టీడీపీ శ్రేణుల‌కు ఎదురైన‌దే. అంటే.. నాడు చంద్ర‌బాబుకు ఏ రీతిన దెబ్బ ప‌డిందో.... రేపు 2024లో జ‌గ‌న్ కు కూడా అదే త‌ర‌హా దెబ్బ ప‌డ‌నుందా? అన్న కోణంలో ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News