హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానం తేలిపోతుందా? నేడే టీటీడీ - క‌ర్నాట‌క చ‌ర్చ‌!

Update: 2021-05-27 04:12 GMT
‘ఆంజ‌నేయుడు ఎవ‌రివాడు? మారుతి జన్మస్థలం ఏదీ?’ ఎంతో కాలంగా తేల‌కుండా ఉన్న‌ ఈ వివాదం.. మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆంజ‌నేయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే జ‌న్మించాడంటూ శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. క‌ర్నాట‌కు నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

తిరుమల ఏడు కొండల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని టీటీడీ స్పష్టం చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో ఆంజ‌నేయుడు జ‌న్మించాడ‌ని ప్రకటించింది. అయితే.. మారుతి తమ ప్రాంతానికి చెందిన వాడని, దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయ‌ని క‌ర్నాట‌క‌ తెలిపింది.

క‌ర్నాక‌ట రాష్ట్రంలోని హంపి స‌మీపంలో ఉన్న ఆంజ‌నేయాద్రి కొండ హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని క‌ర్నాట‌క స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ విష‌యం రామాయ‌ణంలోనూ స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్పింది. ఆ త‌ర్వాత క‌ర్నాట‌క రాష్ట్రానికి చెందిన హ‌నుమ‌త్ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ తీవ్రంగా స్పందిస్తూ.. ఘాటు లేఖ కూడా టీటీడీకి రాసింది. బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలని కోరింది.

ఈ నేప‌థ్యంలోనే ఇవాళ (మే 27) ఇరు ప‌క్షాలు తిరుప‌తిలో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిరుమ‌ల సంస్కృత విద్యాపీఠంలో జ‌ర‌గ‌నున్న భేటీలో.. రెండు రాష్ట్రాల‌కు చెందిన పండితులు పాల్గొన‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు ప‌క్షాలూ.. త‌మ‌ వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను బ‌య‌ట పెట్ట‌నున్నాయి. దీంతో.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. హ‌నుమంతుడు ఎవ‌రి వాడు అన్న విష‌యం ఇప్పుడైనా తేలుతుందా? అనే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News