ప్రతి 10 మందిలో నలుగురికి.. ఫ్యాటీ లివర్

Update: 2022-06-11 09:30 GMT
మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మన కోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో (ఫ్యాటీ లివర్‌) బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయం మహా మొండిది. దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికే ప్రయత్నిస్తుంది. మరి మనం ఆ మాత్రం అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా? కొవ్వు భారాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఎలా?

రోజురోజుకు ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎక్కువగా మద్యం సేవించడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం.. వ్యాయామం చేయకపోవడం.. ఇతర జీవనశైలి లోపాలతో దేశంలో ప్రతి పది మందిలో నలుగురు ఫ్యాటీలివర్ బారిన పడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్‌ డాక్టర్ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు. ఇది మొదట్లో గుర్తిస్తే బరువు తగ్గించుకోవడం ద్వారా సామాన్యస్థితికి చేరుకుంటుందని.. మూడో దశలో లివర్ గట్టి పడుతుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణానికే ముప్పు కలుగుతుందని తెలిపారు. ఆ పరిస్థితిని నాష్‌(నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్) అంటారని చెప్పారు

నానాటికీ పెరిగిపోతున్న 'నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌' సమస్యకు వివిధ విభాగాల నిపుణులతో సమర్థమైన చికిత్సనందించే నాష్‌ క్లినిక్‌ ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్‌లోని ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో ఏర్పాటైంది. ఫ్యాటీ లివర్‌ సమస్యను పూర్తిగా నయం చేసేలానాష్‌ క్లినిక్‌లో ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు.

నాష్ బారిన పడిన వారికి లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఫ్యాటీ లివర్‌తోపాటు వచ్చే మధుమేహం కారణంగా చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే సులభంగా కోలుకోవచ్చని వివరించారు. గతంలో తమ ఆస్పత్రికి వచ్చే ఔట్‌ పేషెంట్లలో 5 మందికి మాత్రమే ఫ్యాటీ లివర్‌ సమస్య ఉండేదని.. ఇప్పుడు 29-30 మందికి ఉంటోందని వెల్లడించారు. అలాగే తాము నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ఫలితాలను విలేకరుల సమావేశంలో నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

'గ్రామీణ ప్రాంతాలలో పల్లెటూర్లలో గత ఏడాది నుంచి ఈ సర్వే కొనసాగుతోంది. పఠాన్‌చెరువు మండలంలోని వాడక్‌పల్లిలో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆ మండలంలోని గ్రామాలతోపాటు మరో 55 గ్రామాలలో సర్వే పూర్తయింది. మరిన్ని గ్రామాల్లో దీన్ని నిర్వహించనున్నారు. సర్వేలో భాగంగా ఏఐజీ సిబ్బంది, ఒక డాక్టర్‌ ఇంటింటికీ వెళ్లి ఒక్కొక్క గ్రామంలో దాదాపు 50-55 మందిని ఎంపిక చేసి ఆరోగ్య వివరాలు సేకరించారు.

అనారోగ్యంతో బాధపడేవారికి అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ, స్కానింగ్‌, రక్త, మూత్రపరీక్షలు నిర్వహించారు. ఎండోస్కోపీ, స్కానింగ్‌, రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 20ు మంది ఫ్యాటీ లివర్‌ బాధితులుండగా, పట్టణప్రాంతాల్లో వారి సంఖ్య 25 దాకా ఉన్నట్టు సర్వేలో తేలింది.' అని నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డితోపాటు, ఆస్పత్రి హెపటాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ మిథున్‌ శర్మ, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ సి.నరసింహన్‌, సెంటర్‌ ఫర్‌ ఒబెసిటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ కలపల పాల్గొన్నారు.

'కనీసం 10ు బరువు తగ్గడం ద్వారా లివర్‌లో ఉన్న కొవ్వు కరిగి సాధారణ స్థితికి చేరే అవకాశముంది. అయితే అది మొదటి రెండు దశల్లో గుర్తిస్తేనే! నిర్లక్ష్యం చేస్తే మూడో దశకు చేరి, లివర్‌ గట్టిపడుతుంది. అది అలాగే కొనసాగితే లివర్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేస్తే మంచిది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, చికెన్‌, చేపలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌ పూర్తిగా మానేయాలి.' అని డాక్టర్‌ మిథున్‌ శర్మ సూచించారు.
Tags:    

Similar News