ప్ర‌తిప‌క్ష నేత‌పై సినీనటీ నగ్మా కామెంట్‌

Update: 2016-09-07 07:25 GMT
తమిళనాడులో మహిళలు సురక్షితంగా సంచరించే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని జాతీయ మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి - తమిళనాడు ఇన్‌ ఛార్జి - నటి నగ్మా డిమాండ్‌ చేశారు. మహిళా కాంగ్రెస్ సమావేశం జరగనున్న నేపథ్యంలో చెన్నైకి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆ రాష్ట్ర మహిళా నేతలు న‌గ్మాతో స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా నగ్మా మాట్లాడుతూ తమిళనాడులో శాంతిభద్రతలు సక్రమంగా లేవని, యువతులకు భద్రత కరవైందని ఆరోపించారు. నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌ లో స్వాతి అనే మ‌హిళ‌ దారుణహత్యకు గురైందని, ఆ తర్వాత విళుపురం - కరూరు - తూత్తుకుడి తదితర ప్రాంతాల్లో యువతులు దారుణ హత్యలకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనలన్నీ తమిళనాడులోని శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయని న‌గ్మా విమర్శించారు. ప్రస్తుతం మహిళలను అశ్లీలంగా చిత్రీకరించి, బెదిరించిన వ్యవహారంపై కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి హసినా సయ్యద్‌ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని, బాధితులకు తగిన న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మహిళలు సురక్షితంగా సంచరించే పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

త‌మిళ‌నాడు కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌విలో ఉన్న ఇలంగోవ‌న్ ను ఆ ప‌ద‌విలోనుంచి త‌ప్పించి వంద‌రోజులు అయిన‌ నేప‌థ్యంలో అధ్య‌క్ష స్థానంపై సైతం న‌గ్మా స్పందించారు. పార్టీ అధిష్ఠానం త్వరలో రాష్ట్ర అధ్యక్షుడిని నియమించనుందని ఆమె ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీ కావడంతో సమస్యలు సహజమని, అందువల్ల అధిష్ఠానం క్షుణ్ణంగా ఆలోచించి టీఎన్‌ సీసీ అధ్యక్షుడిని నియమించనుందని తెలిపారు. మహిళలు పదవీ బాధ్యతలు చేపట్టడానికి అర్హులేనని, టీఎన్‌ సీసీ అధ్యక్ష పదవిలో ఓ మహిళను నియమిస్తే అది పార్టీకి మంచిదేనన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. పార్టీలో స్త్రీ - పురుష భేదాలు లేవని - అందరూ సమర్థులేనని న‌గ్మా  తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌తో మ‌హిళ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

దేశవ్యాప్తంగా రైతులు క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని న‌గ్మా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీనిని నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. కావేరీ నదీ జలాలను విడుదల చేయకుండా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ద్రోహం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, అయితే ఆ వ్యవహారం గురించి తనకు పూర్తిస్థాయిలో అవగాహనలేదని తెలిపారు. చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ - ముఖ్యమంత్రి జయలలిత హెలికాప్టర్‌ లోనే పర్యటించారని - రాహుల్‌ గాంధీ మాత్రం వరదనీటిలో నడిచి వెళ్లి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారని త‌మ నాయ‌కుడిని న‌గ్మా పొగిడేశారు. ఆ సమయంలో కర్ణాటక కూడా తమిళనాడుకు సహాయ సహకారాలు అందించిందని తెలిపారు. అలాంటప్పుడు కావేరీ నదీ జలాల విడుదల వ్యవహారంలో కర్ణాటక ఎలా అన్యాయం చేస్తుందని ఆమె ప్రశ్నించారు. అందుకు ఏదైనా బలమైన కారణాలు ఉండొచ్చని, దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేయాలని అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News