తడిబట్టల మీద కూడా ఇంతలొల్లా?

Update: 2016-04-20 09:18 GMT
ఎవరి నమ్మకాలు వారివి. కానీ.. తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా.. తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తామని చెప్పే తీరు సంప్రదాయవాదులకు ఒళ్లు మండేలా చేస్తోంది. కొన్ని పరిమిత దేవాలయాల్లోకి మహిళల్ని అనుమతించని వైనం కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. ఇక్కడ లింగ సమానత్వం కంటే కూడా.. కొన్నిసంప్రదాయాలు.. ఆచారాలతో మహిళల్ని కొన్ని ఆలయాల్లోకి అనుమతించని వైనం ఉంది.

అయితే.. ఇంతకాలం ఈ విషయం గురించి మాట్లాడని వారు.. ఇప్పుడే ఏదో సమస్య వచ్చినట్లుగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లటం.. దేవాలయాల్లోకి మహిళల్ని అనుమతించని వైనంపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయటం.. వారిని అనుమతిని ఇవ్వటం లాంటి ఘటనలు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. మహిళలకు అనుమతి లభించిన ఆలయాల్లోకి తడిబట్టలతో ఆలయంలోకి రావాలంటూ అక్కడి పూజారులు చెబుతున్నారు. కానీ.. అలాంటిది కుదరదంటున్న వారి కారణంగా తాజాగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర ఆలయంలో ప్రవేశించే మహిళలు తడి బట్టలతో ఆలయంలోకి రావాలని చెప్పినా.. కొందరు మహిళలు అందుకు భిన్నంగా ఆలయంలోకి వచ్చే ప్రయత్నం చేయటం.. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది.. మహిళలకు మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్త పరిస్థితి దారి తీసింది. గర్భగుడిలోకి రావాలని భావించే మహిళలు విధిగా తడిబట్టలతో రావాలని ఆలయ అధికారులు చెబుతున్నారు. దీనికి ససేమిరా అనటంతో మొదలైన ఘర్షణ ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. సంప్రదాయాల్ని.. నమ్మకాల్ని కాస్త పాటిస్తే ఏమవతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News