అవును.. ముగ్గులేసినందుకు అరెస్టు చేశారు

Update: 2019-12-30 08:45 GMT
ప్రజాస్వామ్య భారతంలో ఎవరికి ఇబ్బంది కలుగకుండా.. ఎవరికి సమస్య కాకుండా.. శాంతిభద్రతల ఇష్యూ రాకుండా చేసే నిరసనలు చేపట్టే హక్కు ఉంది. భావస్వేచ్ఛ హక్కులో దీన్ని భాగంగా చెప్పొచ్చు. మరి.. అలాంటి భావస్వేచ్ఛ రోజులు గడిచే కొద్దీ సామాన్యులకు అపురూపమైపోతోందా? అన్నది ప్రశ్నగా మారుతోంది. ప్రజల కొరకు.. ప్రజల చేత.. ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిదులు.. ప్రభుత్వాలు ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకోవాలే కానీ.. తమ చేతిలో ఉన్న పవర్ తో అణగతొక్కేయకూడదు కదా?

పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం చేసినా.. దానిపై కొన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వేళ.. నిరసనకారులు లేవనెత్తే అంశాల్ని.. అభ్యంతరాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటం ద్వారా ప్రభుత్వాలు తమ వాదనను వినిపించొచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ఒక వాదనకే పరిమితం కాకూడదు. అన్ని వాదనలకు వేదికగా ఉండాలి. అందుకు భిన్నంగా అధికారపక్షానికి వ్యతిరేకంగా ఏం చేసినా వారిపై అధికారాన్ని ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు.  

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సాగుతున్న నిరసనలకు పలు రాష్ట్రాలు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా చెన్నైలోని బీసెంట్ నగర్ వీధుల్లో మహిళలు నిరసనల్ని వినూత్నంగా తెలిపారు. మహిళలు ముగ్గులు వేశారు. అందులో పౌరసత్వ సవరణ చట్టాన్ని తప్పు పడుతూ తమ గళాన్ని ముగ్గు రూపంలో తెలిపారు. వీటిని ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ నిరసన సైతం పోలీసులకు నచ్చలేదు. ముగ్గులేని నలుగురు మహిళలతో సహా వారికి సహకరించిన మరో ముగ్గురు.. మొత్తంగా ఏడుగురిని అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

నిరసనల కోసం కత్తులు.. కటార్లు.. కర్రలు.. పట్టుకొని రోడ్ల మీదకు వచ్చి హల్ చల్ చేయలేదు. ఆ మాటకు వస్తే.. రోడ్డు మీద అడ్డంగా కూర్చొంటే ట్రాఫిక్ సమస్య అనుకోవచ్చు. అదేమీ లేకుండా ముగ్గులు వేయటాన్ని కూడా తప్పు పట్టి.. కేసులు పెట్టటాన్ని ఏమనాలి? మోడీ కరుణతో సాగుతున్న తమిళనాడు సర్కారు.. కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. అయినా.. ముగ్గులేసి నిరసన గళం విప్పితే దానికీ కేసు పెట్టి అరెస్ట్ చేయటం మోడీ హయాంలోనే సాధ్యమేమో?
Tags:    

Similar News