ఏపీలో సీఎంను డిసైడ్ చేసేది మ‌హిళ‌లే!

Update: 2019-02-27 04:46 GMT
మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఏపీ వ్యాప్తంగా ఎన్నిక‌ల వేడి చుట్టేసింది. మండే ఎండ‌ల‌కు తోడు.. తాజాగా వ‌చ్చిన ఎన్నిక‌ల హీట్ తో రాష్ట్ర రాజ‌కీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఇదిలా ఉంటే.. ఏపీకి ముఖ్య‌మంత్రి కావాలంటే మ‌హిళ‌లు క‌రుణించాల్సిందే. వారు ఎవ‌రినైతే అభిమానిస్తారో వారే ముఖ్య‌మంత్రి. అందులో ఎలాంటి సందేహం లేద‌న్న విష‌యం తాజాగా వెల్ల‌డైన గ‌ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

స‌మ‌గ్ర ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ 2019లో చేప‌ట్టిన అనంత‌రం తాజాగా తుది ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం ఏపీ వ్యాప్తంగా మొత్తం 3.69కోట్ల ఓట‌ర్లు ఉంటే.. అందులో 1.83 ఓట‌ర్లు పురుషులు కాగా.. 1.86 కోట్ల మంది మ‌హిళ‌లే. అంటే.. పురుష ఓట‌ర్ల కంటే 2.8 ల‌క్ష‌ల మంది మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ ఉన్నారు. మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమంటే ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 123 నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుష ఓట‌ర్ల కంటే మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.

ఈ నేప‌థ్యంలో మ‌హిళా ఓట‌ర్లే అధికార పార్టీ ఎవ‌ర‌న్న‌ది డిసైడ్ చేస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌.. మ‌హిళా ఓట‌ర్లు త‌క్కువ‌గా ఉండే జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం.. గుంటూరు.. ప‌శ్చిమ‌గోదావ‌రి.. నెల్లూరు.. క‌డ‌ప జిల్లాల్లో మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌. ఒక‌ట్రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే అన్నిచోట్ల మ‌హిళ‌ల‌దే పైచేయి. దీంతో.. ఏపీ సీఎం కావాలంటే మ‌హిళ‌ల క‌రుణాక‌టాక్షాలు చాలా అవ‌స‌రం.

జిల్లాల్లో అత్య‌ధికంగా మ‌హిళా ఓట‌ర్లు ఉన్న జిల్లాల్ని చూస్తే..

=  గుంటూరు:  మొత్తం 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో వినుకొండ మిన‌హా మిగిలిన 16 చోట్ల మ‌హిళా ఓట‌ర్లే అధికం

=  ప‌శ్చిమ‌గోదావ‌రి:  జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో న‌ర్సాపురం మిన‌హా మిగిలిన 14చోట్ల మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.

=  నెల్లూరు:  జిల్లాలోని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ఉద‌య‌గిరి మిన‌హా మిగిలిన తొమ్మిది చోట్ల మ‌హిళ‌లే ఎక్కువ‌.

=  విజ‌య‌న‌గ‌రం:  ఈ జిల్లాలోని తొమ్మిది నియోజ‌క‌వర్గాల్లో చీపురుప‌ల్లి మిన‌హా మిగిలిన ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల కంటే మ‌హిళా ఓట‌ర్లే ఎక్కువ‌.

అతి త‌క్కువ ఎక్కడంటే..

+  అనంత‌పురం:  జిల్లాలో మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా ఒక్క గుంత‌క‌ల్లు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పురుష ఓట‌ర్లే ఎక్కువ‌. పురుషు ఓట‌ర్ల‌కు మ‌హిళా ఓట‌ర్ల‌కు మ‌ధ్య‌ అంత‌రం కాస్త ఎక్కువే.

+  శ్రీ‌కాకుళం:  జిల్లాలో మొత్తం 14 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ప‌లుచోట్ల మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువే అయినా.. వ్య‌త్యాసం చాలా త‌క్కువ‌. జిల్లా మొత్తంగా చూస్తే పురుష ఓట‌ర్ల‌తో పోలిస్తే మ‌హిళా ఓట‌ర్లు కేవ‌లం 7163 మంది ఓట‌ర్లు మాత్ర‌మే ఎక్కువ‌.
Tags:    

Similar News