ఐటీ : జూలై 31 వరకు వర్క్‌ ఫ్రం హోం !

Update: 2020-04-29 09:10 GMT
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు శుభవార్త. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను విధించడంతో ..ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం ను ఇచ్చాయి. ప్రస్తుతం అందరూ ఇంటి నుండే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం మరో తీపి కబురు అందించింది. ఐటీ కంపెనీలతోపాటు బీపీవో సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31 వరకు ఇండ్ల నుంచి విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ‌ప్రసాద్‌ మంగళవారం రాష్ట్రాల ఐటీ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ‌లో వెల్లడించారు.

వర్క్‌ ఫ్రం హోంకు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అనుమతి ఈ నెల 30వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఐటీ - బీపీవో కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ అనుమతిని జూలై 31 వరకు పొడిగిస్తున్నట్టు రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ - పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ప‌లు కీల‌క ప్ర‌తిపాద‌న‌లు పెట్టారు. చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు జపాన్‌ లాంటి దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. ఇలాంటి పరిశ్రమలను - ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను భారత్‌ కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేయగలిగితే దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. అలాగే, ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలు విరివిగా ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్న నేపథ్యంలో బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్ ‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరమున్నదని, ఈ విషయంలో కేంద్రం మరింత చొరవ చూపాలని అన్నారు.


Tags:    

Similar News