డాటర్ ఆఫ్ యనమల : పెద్దాయన వారసత్వ జెండా ఎగిరేనా...?

Update: 2022-08-26 02:30 GMT
ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు. ఆ పార్టీ పుట్టకముందు ఆయన యువ న్యాయవాదిగా ఉన్నారు. టీడీపీకి ముందు తుని రాజుల కోటగా ఉండేది. అలాంటి చోట బీసీల జెండా ఎత్తిన ఘనత ఆయనదే. ఆయనే టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామక్రిష్ణుడు. ఆయన టీడీపీ తరఫున ఇ1983 నుంచి 2004 వరకూ అంటే 21 ఏళ్ల పాటు ఆరు సార్లు ఏకధాటీగా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత 2009 లో  ఓటమి ఆయనను పలుకరించింది.  ఇక 2014, 2019లలో ఆయన తమ్ముడు యనమల క్రిష్ణుడు పోటీ చేసినా వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేతిలో ఓడిపోయారు.

యనమల మాత్రం పెద్దల సభకు  ఎమ్మెల్సీగా ఇప్పటికి రెండు సార్లుగా నెగ్గుతూ వస్తున్నారు. టీడీపీ సర్కార్ లో ఆయన ఆర్ధిక మంత్రిగా బాబు పక్క సీట్లో కూర్చోవాల్సిందే. అలాంటి సమర్ధ నేత యనమల ఇపుడు ఏడు పదుల వయసులో ఉన్నారు. ఇక ఆయన ఎమ్మెల్సీ  సభ్యత్వం 2025 దాకా ఉంది. దాంతో ఆ మీదట  ఆయన చట్ట సభలకు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేద్దామని భావిస్తున్నారు. ఇక వరసగా రెండు సార్లు తునిలో ఆయన తమ్ముడు ఓడాక  అక్కడ టీడీపీ కొత్త  అభ్యర్ధి కోసం చూస్తోంది అని అంటున్నారు.

ఇక యనమల వేరే చోట 2024 ఎన్నికల్లో  తన సొంత కుమార్తెనే బరిలోకి దించాలని భావిస్తున్నారుట. అందుకోసం యనమల ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. తన కుమార్తెను ప్రత్తిపాడు అసెంబ్లీ సీటు నుంచి పోటీకి పెట్టాలని యనమల రామక్రిష్ణుడు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.  ఇక్కడ వైసీపీ గట్టిగానే ఉంది. ఇక  2019 ఎన్నికలలో చూస్తే వైసీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి పర్వత ప్రసాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మామూలుగా అయితే ఇప్పటిదాకా ఈ సీటుని కాపులకే అన్ని పార్టీలు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ యాదవులు కూడా ఎక్కువగా ఉన్నారు. దాంతో యనమల కుమార్తెకు ప్రత్తిపాడు టికెట్ ని అడగాలని యనమల భావిస్తున్నారుట. ఇక వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పనితీరు కూడా బాగా లేదని టాక్. ఆయన మీద వ్యతిరకత బాగా వస్తోంది. దాంతో వైసీపీ కూడా ఆయన్ని మార్చేసి 2024 ఎన్నికలకు యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలని చూస్తోందిట.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి, శంకవరం మండలాలలో  యాదవ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. దాంతో  యనమల కుమార్తె కనుక పోటీ చేస్తే ఆమెను గట్టిగానే ఎదుర్కోవడానికి వైసీపీ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన  అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అలా తునిని దాటి వెళ్ళి ప్రత్తిపాడులో తన కుమార్తెను ఎమ్మెల్యేగా చూడాలని యనమల తాపత్రయపడుతున్నారు. మరి చంద్రబాబు దీని మీద ఏమంటారో చూడాలి.

అదే విధంగా ప్రత్తిపాడులో యనమల కుమార్తెకు టికెట్ ఇస్తే తునిలో ఎవరికి టీడీపీ టికెట్ దక్కుతుందో అది కూడా ఆలోచించాలి. ఇక ప్రత్తిపాడులో యనమల పాగా వేస్తాను అంటే లోకల్ లీడర్స్ ఎలా రియాక్ట్ అవుతారో అది కూడా చూడాలి. మొత్తానికి యనమల తన కూతురుని ఎమ్మెల్యేగా చేయాలని చూస్తున్నారు. అలా తన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్నారు. మరి పెద్దాయన వారసత్వ జెండా ప్రత్తిపాడులో ఎగురుతుందా. వేచి చూడాల్సి ఉంది.
Tags:    

Similar News