కొస‌రు కొంప‌ముంచుతుంద‌న్న య‌న‌మ‌ల‌!

Update: 2019-06-22 06:42 GMT
అస‌లు కంటే కొస‌రు ముద్దంటారు. కానీ.. కొస‌రు కొంప‌ముంచుతుంద‌న్న విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పిన అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు మాజీ మంత్రి.. సీనియ‌ర్ టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. పార్టీ మారి ఫిరాయింపుల‌కు పాల్ప‌డే నేత‌ల కార‌ణంగా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న మాట ఆయ‌న నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం. పార్టీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరిన నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం టీడీపీలో పెను ప్ర‌కంప‌నాల్ని సృష్టిస్తోంది.

తాజా ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి పార్టీ ఫిరాయింపులు కూడా కార‌ణ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. తాజాగా బీజేపీలోకి పార్టీ నేత‌లు జంప్ అయిన నేప‌థ్యంలో ఒక టీవీ ఛాన‌ల్ తో మాట్లాడిన య‌న‌మ‌ల వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇత‌ర పార్టీల నుంచి తెచ్చుకునే నాయ‌కుల‌తో పార్టీ ఎప్పుడూ బ‌ల‌ప‌డ‌ద‌న్న ఆయ‌న‌..ఒక‌వేళ అదే నిజ‌మైతే తాము 23 మంది ఎమ్మెల్యేల‌ను తెచ్చుకున్నామ‌ని.. చివ‌ర‌కు ఏమైంద‌ని ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం. తాము భారీగా ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తెచ్చినా ఎన్నిక‌ల ఫ‌లితాల వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి ప్ర‌భుత్వ‌మే పోయింద‌న్నారు. ఆ పోవటం కూడా భ‌యంక‌రంగా పోయింద‌న్న వ్యాఖ్య చేయ‌టం గ‌మ‌నార్హం.

తాము తీసుకొచ్చిన 23 మంది ఏం చేయ‌గ‌లిగార‌న్న య‌న‌మ‌ల‌.. పార్టీలోకి వారు రావ‌టం ద్వారా చేసిన మేలేమిటంటూ బాబు నిర్ణ‌యాన్ని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిరాయింపుల మీద తాను మొద‌ట్నించి చెబుతున్నానని.. ఏపార్టీలో అయినా వీటి వ‌ల్ల అంత‌ర్గ‌తంగా స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న్నారు. ఏపీలో బీజేపీ అంద‌రిని బ‌య‌ట నుంచి తెచ్చుకొని బ‌లోపేతం అవుదామంటే.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్నారు.

ప్ర‌జ‌ల్లో నిజ‌మైన బ‌లం వ‌స్తేనే పార్టీగా స్థిర‌ప‌డ‌తామ‌ని.. ఫిరాయింపు నేత‌ల వ‌ల్ల కాద‌న్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి వ‌చ్చిన ఓటు శాతం 0.5 శాత‌మేన‌ని.. దాన్ని పెంచుకోవాలంటే ఇలాంటి ఫిరాయింపుల‌తో సాధ్యం కాద‌న్న య‌న‌మ‌ల వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.  సంక్షోభ స‌మ‌యంలో అధినేత నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టే రీతిలో మాట్లాడ‌టం ఒక ఎత్తు అయితే.. న‌లుగురు ఎంపీలు పార్టీని వీడ‌టం పెద్ద సంక్షోభం కాద‌న్న‌ట్లుగా చెబుతున్నా.. పార్టీలో ఎప్పుడేం జ‌రుగుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

   

Tags:    

Similar News