యనమల ఓవర్ కాన్ఫిడెన్సే రోజాను గెలిపించింది

Update: 2016-03-17 07:31 GMT
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఏపీ శాసనసభ గత సెషన్స్ లో రోజా సీఎం చంద్రబాబుపై అసభ్యకర భాష వాడారని... దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆమెను సభను ఏకంగా ఏడాది కాలం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కోర్టుకెక్కారు. కోర్టులో విచారణ నిన్న బుధవారం వేగవంతమైంది. కేసు విచారణ నిన్న మూడు విడతల్లో జరిగి వాదనలు విన్న తరువాత తీర్పు గురువారానికి వాయిదా వేశారు. ఈ రోజు ఉదయాన్నే ఇచ్చిన తీర్పులో హైకోర్టు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. సస్పెన్షన్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే... ఇది శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా అది వాస్తవమే కావొచ్చు కానీ..  రోజాపై సస్పెన్షన్ వేటు వేసిన సందర్భంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనల కారణంగా కోర్టు జోక్యాన్ని ఎవరూ తప్పు పట్టలేని పరిస్థితి ఉంది.

నిజానికి తొలుత తన సస్పెన్షన్ పై రోజా వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. దాంతో రోజా సుప్రీంకోర్టు కు వెళ్లారు. విచారణ జరపాలంటూ అక్కడి నుండి అందిన ఆదేశాలతో హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. గురువారం తీర్పు ఇచ్చింది.. అంటే.. తొలుత శాసన వ్యవస్థలో జోక్యానికి న్యాయవ్యవస్థ ఇష్టపడకపోయినప్పటికీ.. రోజా తరఫు న్యాయవాది లేవనెత్తిన బలమైన అంశం ఈ కేసులో కోర్టు సంచలన తీర్పుకు కారణమైనట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు.

అసెంబ్లీలో నిబంధనల్లోని సెక్షన్ 340 ప్రకారం రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అయితే... ఆ సెక్షన్ ప్రకారం కేవలం ఒక సెషన్ కు సస్పెండ్ చేయడానికి మాత్రమే వీలుంటుంది. కానీ... ఆ సంగతి సరిగా చూసుకోకుండా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల సెక్షన్ 340 కింద రోజాను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రతిపాదించగా స్పీకర్ కోడెల కూడా ఏమాత్రం చూసుకోకుండా ఓకే చేసేశారు. యనమల చేసిన ఆ పొరపాటు రోజాకు వరంగా మారింది. అంతేకాదు... సుప్రీంకోర్టులోనూ రోజా తరపు న్యాయవాదులు ఆ పాయింట్ నే లేవనెత్తడంతో కేసు సత్వరం విచారించాలంటూ సుప్రీంకోర్టు హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు కూడా దాని ఆధారంగానే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి శాసనసభ వ్యవహారాల నిబంధనలన్నీ అక్షరం అక్షరం తెలిసినట్లుగా మాట్లాడే యనమల రామకృష్ణుడే చివరకు చంద్రబాబు పరువు తీసినట్లయింది.
Tags:    

Similar News