మోడీయే దిక్కని చెప్పేసిన యనమల

Update: 2015-10-29 10:17 GMT
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఆర్థిక కష్టాలు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఇక కేంద్రమే దిక్కని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం తగ్గిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని,కేంద్రం నిధుల కోసం ఎదురు చూస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం చెప్పారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ 2018 డిసెంబర్ నాటికి చేస్తామని చెప్పారు. రైతుల రుణాలు, అందుకు వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఏపీలో ఆదాయం భారీగా తగ్గిందని... కేంద్రం నిధుల కోసం ఎదురు చూస్తున్నామని యనమల తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అన్ని విభాగాలు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. రుణమాఫీ - పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో రూ.9వేల కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. రుణమాఫీ అమలుపై ఏర్పాటైన సబ్ కమిటీ భేటీ ఉదయం విజయవాడలో భేటీ అయింది. కమిటీ సమావేశానికి హాజరైన యనమల భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలన్నీ చెప్పారు.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే మంత్రులు, అధికారులకు ఖర్చులు తగ్గించుకోవడంపై సూచనలు చేశారు. అసలు బడ్జెట్ లోనూ ఖర్చుల నియంత్రణ ఉండాలన్న ఆయన సూచనతో ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దికాలం పాటు ఏపీప్రభుత్వం పిసినారితనం ప్రదర్శిస్తే తప్ప బండి నడిచేలా కనిపించడం లేదు. ఈలోగా కేంద్రం నుంచి నిధులు అందితే మాత్రం కొంత నయమవుతుంది. లేదంటే తిప్పలు తప్పవు.
Tags:    

Similar News