చంద్రబాబు నిరసన దీక్ష షురూ.. పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష

Update: 2021-10-21 03:56 GMT
ఏపీలో రాజకీయాలు మునుపెన్నడూ లేనంతా హీటెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వీరిద్దరి మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎంపైన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలు, కార్యాలయాలపై దాడులకు దిగారు. సీఎంపై బూతులు తిట్టడం ఏంటంటూ వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.

బూతులు తిడితే తన ఫ్యాన్స్ ఊరుకోరని సీఎం జగన్ సైతం చెప్పడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నిన్న బంద్ కు పిలుపునిచ్చారు. ఈరోజు నిరసన దీక్షకు దిగుతున్నారు.

టీడీపీపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగుతున్నారు. పార్టీ కార్యాలయంలో ఎక్కడ దాడి జరిగిందో అక్కడే చంద్రబాబు దీక్షకు దిగారు. పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఇదే సమయంలో ఈ దీక్షకు కౌంటర్ గా వైసీపీ కొత్త నిర్ణయం తీసుకుంది.

రాజకీయాల్లో ప్రతిపక్ష టీడీపీ బూతుల రాజకీయాలను నిరసిస్తూ ఇదే రోజు ఈనెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలకు వైసీపీ పిలుపునిచ్చింది. జనాగ్రహ దీక్షల నిర్వహణపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. జిల్లాల్లో ప్రధానమైన చోట్ల జనాగ్రహ దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

రాజకీయంగా పైచేయి సాధించడం కోసం ఇప్పుడు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు 36 గంటల దీక్షకు దిగగా.. పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్షలు చేయనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం వరకూ రెండు పార్టీల నేతల పోటాపోటీ దీక్షలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ కానుంది.
Tags:    

Similar News