ఎమ్మెల్సీగా చంద్రబాబు...కుప్పం ఏం కాను...?

Update: 2022-11-19 12:30 GMT
చంద్రబాబు పెద్ద మనిషి. రాజకీయ దురంధరుడు. అలాంటి వారు ఉండాల్సింది పెద్ద సభలోనే. కానీ ఆయన ప్రజా క్షేత్రంలో ఉంటూ ఎమ్మెల్యేగా ఇప్పటికి అనేకసార్లు గెలిచారు. అందువల్ల ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు ఎమ్మెల్సీ ఎందుకు అవుతారు. అయితే వైసీపీ పొలిటికల్ ర్యాంగింగ్ చేస్తూ బాబుని కాస్తా ఎమ్మెల్సీని చేస్తామంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెడతాను అని చంద్రబాబు చాణక్య శపధం చేస్తే దాన్ని ఎద్దేవా చేస్తోంది వైసీపీ.

అంత సీన్ లేదు కానీ టీడీపీ కచ్చితంగా 2024 ఎన్నికల్లో ఓడిపోతుంది. బాబు స్వయంగా కుప్పంలో ఓటమి పాలు అవుతారు. అపుడు ఆయనకు మేము ఎమ్మెల్సీగా ఆఫర్ ఇచ్చి మరీ అక్కడికి పంపిస్తామని కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరి జయరాం అంటున్నారు. బాబు కర్నూల్ లో మూడు రోజుల టూర్ చేశారు, దాంతో ఆ జిల్లాకు చెందిన మంత్రిగా జయరాం ఇపుడు బిగ్ సౌండ్ చేస్తున్నారు.

చంద్రబాబు ముమ్మారు సీఎంగా ఉండి జనాలకు ఏం చేశారని మళ్ళీ అధికారం కావలని అంటున్నారు అని మంత్రి గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సానుభూతి కోసం లాస్ట్ చాన్స్ అన్నా అది దక్కేది లేదని కూడా ఆయన చెప్పేశారు. పార్టీ గెలుపు  విషయంలోనే ఇలా డౌట్ పడుతున్న చంద్రబాబు తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గుతారా అని బిగ్ క్వశ్చన్ వేస్తున్నారు మంత్రి గారు

దాని కంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా కుప్పం నుంచి అసలు పోటీ చేస్తారా అన్న సందేహన్ని కూడా లేవనెత్తుతున్నారు. చంద్రబాబు దేశ్ కా నేత అని ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటి ఆయన ప్రజలకు తన పాలనలో ఏమి చేశారో చెప్పగలరా అని జయరాం ప్రశ్నించారు. ఏపీలో మూడేళ్ళ పాలనలో వైసీపీ అన్ని వర్గాలు కులాలు ప్రాంతాలకు కూడా అతీతంగా మేలు చేసిందని ఆయన గుర్తు చేశారు.

చివరి ఎన్నికలు అంటూ ఎన్ని డ్రామాలు ఆడినా బాబుకు జనాలు మద్దతు ఇవ్వరని మంత్రి తేల్చేశారు 2014లో నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్న బాబు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిశారని, 2024లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారో కానీ బాబుకు మాత్రం ఓటమి తప్పదని చెప్పుకొచ్చారు. ఈసారి 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వచ్చే ఆ సీట్లను కూడా గెలిచేది లేదన్నారు.

ఇక 2024 ఎన్నికల్లో బాబు ఓడాక టీడీపీకి కనుక రాజీనామా చేసి వస్తే తమ పార్టీలో చర్చుకుని ఎమ్మెల్సీ చేస్తామని జయరాం చెప్పడమే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. మరి చంద్రబాబు వైసీపీలోకి వస్తే జగన్ చేర్చుకుంటారా అన్నదే చర్చ. అంటే బాబుని రాజకీయంగా ర్యాంగింగ్ చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటున్నారు.

అలాగే చినబాబు లోకేష్ కార్పోరేటర్ గా గెలవలేడు కాబట్టి ఆయనకు కో ఆప్షన్ మెంబర్ పదవి ఇస్తామని జయరాం చెప్పడం మరో సెటైర్. ఏది ఏమైనా బాబు విషయంలో వైసీపీ మళ్లీ దూకుడు పెంచిందనే చెప్పాలి. దానికి కారణం ఆయన సభలకు జనాలు ఎక్కువగా హాజరవుతూండడమేనా లేక ఆయన చెప్పిన లాస్ట్ చాన్స్ కి జనాలు మద్దతు ఇస్తారని కలవరమా అన్నదే చర్చగా ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News