ఏపీ రోడ్ల దుస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే అసహనం!

Update: 2022-10-21 04:52 GMT
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్ల దుస్థితికి సంబంధించి ఇప్పటికే జనసేన, టీడీపీలు పలు ఉద్యమాలు చేశాయి. స్వయంగా రోడ్లపై పడిన పెద్ద గుంతల్లో నాట్లు వేసి నిరసనలు కూడా తెలిపాయి. జనసేన పార్టీ నేతలు అయితే స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తమ సొంత నిధులతో రోడ్లకు మరమ్మతులు చేశారు. స్వయంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి అప్పట్లో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు. ట్విట్టర్‌లోనూ జేఎస్సీఫర్‌ఏపీరోడ్స్‌ అనే హ్యాష్‌టాగ్‌తో రోడ్ల పరిస్థితిని జన సైనికులు ట్రెండింగ్‌లోనూ నిలిపారు.

మరోవైపు జగన్‌ ప్రభుత్వం మాత్రం ఈ రోడ్లు వర్షాలకు, వరదలకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పాడయ్యాయని చెప్పుకొచ్చింది. తమ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు కావని వింత వాదన చేసింది. చంద్రబాబు హయాంలోనే ఈ రోడ్లు పాడయ్యాయనని.. ప్రస్తుతం వర్షాలు, వరదలకు ఇంకా పాడయ్యాయని వైసీపీ నేతలు వితండ వాదం చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటికే ఏపీ రోడ్ల గురించి ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ గుంతలమయంగా మారిన రోడ్లపైన పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.

ఇటీవల గణేష్‌ నవరాత్రుల సందర్భంగా లడ్డూలు వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బులను రోడ్ల మరమ్మతులకు వినియోగించారు. వీటికి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేసింది. మరమ్మతులు చేయడానికి తమ అనుమతులు తీసుకోలేదని ప్రతిపక్షాలు రోడ్లను మరమ్మతులు చేసిన చోట వారిపై కేసులు పెట్టడం వివాదాస్పదమైంది.

ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్లడానికి ఉన్న 20 కి.మీ. దూరం ప్రయాణించడానికి తమకు గంట సమయం పట్టిందని కేంద్ర మంత్రి మురళీధరన్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను కూడా నెరవేర్చలేదని మురళీధరన్‌ మండిపడ్డారు. ఇంత దారుణమైన రోడ్లా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా కేంద్ర మంత్రి మురళీధరన్‌ పోస్టు చేశారు.

ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీ నేతలు రోడ్ల దుస్థితిపై మండిపడగా ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే రోడ్లపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ నేత ఒకరు ట్విట్టర్‌లో 30 సెకండ్లు ఉన్న వీడియోను పోస్టు చేశారు. అందులో అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఒక కారు వద్ద నుంచొని ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు ఉంది.

రోడ్లు బాగో లేదని అసభ్యంగా మాట్లాడుతూ.. కాంట్రాక్టర్‌తో మాట్లాడుతున్నట్టు ఉంది. తనను ప్రజలు ఆపేశారని.. మట్టి రోడ్లు వేస్తే.. ఎవరికి ప్రయోజనమని నిలదీసినట్టు వీడియోలో ఉంది. మంచి రోడ్లనుక కూడా తవ్వేసి గొయ్యలు పూడ్చకుండా వదిలేస్తే ఎలా అని ప్రశ్నించినట్టు ఆ వీడియోలో ఉంది. వాడు డబ్బులు ఇవ్వట్లేదని వీళ్లను ఇబ్బంది పెడితే మమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కరణం ధర్మశ్రీ అన్నట్టు ఆ వీడియోలో ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News