విశాఖ వద్దు అంటున్న వైసీపీ ఎంపీ గారు...?

Update: 2022-10-26 04:40 GMT
విశాఖ మీద ఇపుడు ఏపీ రాజకీయం అంతా జోరు చేస్తున్న సంగతి తెలిసిందే. అవుతుందో కాదో తెలియదు కానీ విశాఖ రాజధాని అన్నది మాత్రం నినాదంగా ఎక్కడో ఒక చోట వినిపిస్తోంది. ఆ విధంగా విశాఖ గురించి నలుగురూ చర్చించుకునే విధంగా రాజధాని విషయం అయితే ఉంది మరి. విశాఖను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఒక వైపు చెబుతోంది. విశాఖ రాజధానితోనే  సమస్తం ఉత్తరాంధ్రా జిల్లాలకు సమకూరుతాయని కూడా నమ్మబలుకుతోంది.

సరే వాటి సంగతి చూస్తే  అవి ఎపుడో అవి ఎపుడు వస్తాయో తెలియదు కానీ విశాఖలో ప్రస్తుతం ఉన్న యాక్టివిటీని బ్రేక్ చేసేలా కొందరు చర్యలకు పాల్పడుతూ ఉన్న వారికే విసుగెత్తించేలా చిరాకు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. ఫలితంగా విశాఖ ఎంపీ కూడా చికాకేసి విశాఖకు గుడ్ బై అనే స్థితికి వస్తున్నారు అని గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీ గారే ఇలా విశాఖను విడిచిపోవాలన్న వేదాంతంలోకి  వచ్చారు అంటే దాని వెనక జరిగిన జరుగుతున్న రాద్దాంతం గురించి వైసీపీ పెద్దలకు ఏమైనా అవగాహన ఉందా. ఒకవేళ అవి జరుగుతూంటే వాటిని చక్కదిద్దే పరిస్థితి ఉందా అన్నదే ఇపుడు ఇంటా బయటా చర్చ.

అయన ఎంపీ కాక ముందే రియల్ ఎస్టేట్ రంగంలో బిగ్ షాట్. ఆయనే ఎంవీవీ సత్యనారాయణ. ఆయన తన రియల్ ఎస్టేట్ వ్యాపారం తాను చేసుకుని హాయిగా ఉండక అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానా అని ఇపుడు బాధపడుతున్నట్లుగా ఉంది మరి. పోనీ ఏపీలో ఏమీ విపక్ష ప్రభుత్వం లేదు. సొంత ప్రభుత్వమే ఉంది. పైగా ఆయన విశాఖ ఎంపీగా ఉన్నారు. మరి నల్లేరు మీద నడకగా సాగాల్సిన ఆయన వ్యాపారానికి అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయి. అలాంటి  పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, కల్పిస్తోంది ఎవరు అంటే స్వజనులే అని ఆయన అనుచరుల నుంచి వస్తున్న మాటగా ఉంది.

లేకపోతే ఎంవీవీ ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టి అందులో లేని లోపాలను వెతుకుతూ మీడియాకు మసాలను పంచుతూ రచ్చ చేస్తున్న వారు వైసీపీలోనే ఉన్నారని ఎందుకు వాపోతారు. ఎంపీ విజయసాయిరెడ్డి 2016 నాటి ఒక ల్యాండ్ ఇష్యూని ఈ మధ్యనే మీడియా ముందు అన్యాపదేశంగా పెట్టి ఎంవీవీని ఇండైరెక్ట్ గా కెలికారు. ఈ ఇద్దరి మధ్యన ఉన్న రాజకీయ విభేదాలు కానీ మరోటి కానీ ఇపుడు ఎంవీవీ ప్రాజెక్టుల మీద నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయని అంటున్నారుట.

ఇక ఎంవీవీ ఏ కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేసినా దాని మీద విమర్శలు చేసే వారు ఎక్కువ అయిపోయారు అని అంటున్నారు. మరో వైపు ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు హైదరాబాద్ లో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విశాఖకు షిఫ్ట్ చేసుకున్నారని, దాంతో పోటీ కూడా వస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యాన్ని చూసి విసిగిన ఎంపీ గారు విశాఖకు గుడ్ బై అనేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఆయన కొంత కాలం క్రితం మీడియా ముఖంగానే ఇదే విషయాన్ని వెల్లడించారు.

ప్రస్తుతం తాను టేకప్ చేసిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే విశాఖలో కొత్త వెంచర్లు ఏవీ ఉండవని కూడా చెప్పేశారు. ఆయన తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్, బాచుపల్లి ప్రాంతాలలోనే కొత్త ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దానికి ఫక్తు రాజకీయాలే కారణమని అంటున్నారు. మరి వైసీపీలో ఒక రియల్ ఎస్టేట్ అధినేత ఇలా రాజకీయాల వల్ల విసిగి వేరే చోటకు వెళ్లిపోతే విశాఖ అభివృద్ధి ఎలా సాగుతుంది. రాజధాని మాట దేముడెరుగు ముందు సిటీ ప్రగతి ఎలా సాధ్యపడుతుంది అన్నది కీలకమైన ప్రశ్న.

సొంత పార్టీ వారి వ్యాపారాలనే సవ్యంగా చేసుకోనిచ్చే పరిస్థితి లేకపోతే బయట వారు ఇతర వ్యాపారులు ధైర్యంగా ఎలా ముందుకు వస్తారు అని కూడా మొరో ప్రశ్న. ఇవన్నీ పక్కన పెడితే ఎంపీ విజయసాయిరెడ్డి ఎంవీలీల మధ్యన ఏర్పడిన విభేదాలను ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకోవాలనే అధినాయకత్వం  సలహా ఇస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అన్నదే ప్రశ్న. అలాగే ఎంపీ గా మరోమారు పోటీ చేసే ఉద్దేశ్యం కూడా ఎంవీవీకి లేదు అని మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఆయన వంటి బిగ్ షాట్ వైసీపీ నుంచి విశాఖ నుంచి దూరం జరిగితే మాత్రం అన్ని విధాలుగా ఇబ్బందే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News