ఇవేం స‌ల‌హాలు.. వైసీపీని ముంచుతున్నారా?

Update: 2021-10-20 13:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. ఆ పార్టీ నేత‌ల అనుస‌రిస్తున్న వైఖ‌రితో ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ఆ పార్టీ చేజేతులారా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను కోల్పోతుంది. ఇప్పుడు ఏపీలో ఈ విష‌యాల‌పైనే ప్ర‌ధానంగా చ‌ర్చ సాగుతోంది. ఆ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాలతో ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ పార్టీకి ఇలాంటి స‌ల‌హాలు ఎవ‌రిస్తున్నారు? స‌ల‌హాదారులుగా స‌రైనోళ్లు లేరా? ఈ స‌ల‌హాల‌తోనే పార్టీని ముంచుతున్నారా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

అధికారంలో ఉన్న పార్టీ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌నిచేస్తూనే ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధాన‌మిస్తూ మాట‌ల‌తో పాటు చేత‌ల్లోనూ త‌మ ప‌నితీరు చూపించాలి. విప‌క్షాల మాట‌ల‌కు హుందాత‌నంతో రాజ‌కీయ విలువ‌ల‌తో బ‌దులివ్వాలి. కానీ ప్ర‌స్తుతం ఏపీలో అధికార వైసీపీ అనుస‌రిస్తున్న తీరు అందుకు విరుద్ధంగా ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు తీవ్ర వ్యాఖ్య‌ల‌కు వైసీపీ నేత‌లు మాట‌ల‌తోనే కాకుండా చేత‌ల‌తోనూ స్పందించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై దాడులు ఆ పార్టీ కార్యాల‌యాల‌ను ధ్వంసం చేయ‌డం లాంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల వైసీపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త భావం పెరిగే ప్ర‌మాదం ఉంది. కానీ ఈ విష‌యాల‌ను ముందుగానే అంచ‌నా వేయ‌లేక‌పోతున్న పార్టీలోని స‌ల‌హాదారులు ఆ నాయ‌కులకు ఇలాంటి స‌ల‌హాలు ఇవ్వ‌డం ఎంత మాత్రం స‌మంజ‌సం కాద‌నే అభిప్రాయాలు క‌లుగుతున్నాయి.

గ‌త టీడీపీ హ‌యాంలోని చంద్ర‌బాబు స‌ర్కారు ఇలాగే వ్య‌వ‌హ‌రించింది. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకోవ‌డం వైసీపీ నేత‌ల కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం లాంటి చ‌ర్య‌లు తీసుకుంది. దీంతో టీడీపీ చేస్తున్న ప‌నుల‌ను గ‌మ‌నించిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి స‌రైన గుణ‌పాఠం చెప్పారు. చిత్తుగా ఓడించారు. కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకోవ‌డం.. ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ను అరెస్టు చేయ‌డం.. టీడీపీ నేతలపై ఇళ్ల‌పై పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం లాంటి చ‌ర్య‌ల వ‌ల్ల జ‌గ‌న్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం క‌చ్చితంగా ఉంది. కానీ జ‌గ‌న్‌తో స‌హా ఆ పార్టీ నాయ‌కులు ఈ విష‌యాన్ని అర్థం చేసుకోలేక‌పోతున్నార‌ని స‌ల‌హాదార్లు ఇచ్చిన సూచ‌న‌లు స‌లహాల‌ను గుడ్డిగా ఫాలో అయిపోతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై దాడి చేసిన వ్య‌క్తుల్లో ఒక‌రిని ప‌ట్టుకున్న టీడీపీ నాయ‌కులు మీడియా ముందుంచారు. ఆ ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి పోలీస్ అధికారిని అని చెప్తున్నార‌ని కానీ అందుకు త‌గిన ఆధారాలు చూపించ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు చెప్పారు. ఆ వ్య‌క్తిపై ఫిర్యాదు చేసి ఆయ‌న్ని పోలీస్ స్టేష‌న్లో అప్ప‌గిస్తామ‌ని టీడీపీ నాయ‌కులు తెలిపారు. ఇప్పుడా వ్య‌క్తి ఎవ‌రన్న‌ది తేలాల్సి ఉంది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద పీఠ వేశారు. ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటున్నారు. న‌వ‌ర‌త్నాల పేరుతో జ‌నాల‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో సాయంగా నిలుస్తున్నారు. ఈ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల జ‌గ‌న్‌కు మైలేజీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ ఈ ప‌థ‌కాల‌ను హైలైట్ చేసుకుని ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కాపాడుకోవ‌డం ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఇలాంటి దాడుల వ‌ల్ల ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత‌ను పొందే ప్ర‌మాదం ఉంది. ఆ విష‌యాన్ని జ‌గ‌న్‌కు అర్థ‌మ‌యేలా చెప్పే నాయ‌కులు ఆయ‌న చుట్టూ ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ ఇప్ప‌టికైనా అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌న పంథా మార్చ‌కుంటే త‌ప్ప వచ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌నే రాజకీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.


Tags:    

Similar News