వైసీపీ వ్యూహంలో విజ‌య‌న‌గ‌రం టీడీపీ విల‌విల‌..!

Update: 2021-08-12 04:53 GMT
రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను ఇరుకున పెట్టేందుకు పార్టీలు ప్ర‌య‌త్నించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌జ‌ల్లో ప‌ట్టున్న నాయ‌కుల‌ను డైల్యూట్ చేయ‌డం.. వారిని ఇరుకున పెట్ట‌డం ద్వారా.. వారిని ఒక విష‌యంవైపే దృష్టి పెట్టే లా చేయ‌డం.. త‌ద్వారా.. తెర‌చాటున చాప‌కింద నీరులా త‌మ ప‌ని చ‌క్క‌బెట్టుకోవ‌డం వంటివి రాజ‌కీయాల్లో ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారిపోయాయి. అయితే.. ఇలాంటి వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టి.. ఆయా పార్టీల నేత‌లు.. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో 2019 ఎన్నిక‌ల కు ముందు.. 2014 ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇలానే వ్య‌తిరేక ప్ర‌చారం సాగింది.

మూకుమ్మ‌డిగా.. రాజ‌కీయ పార్టీలు.. ప్ర‌ధాన మీడియా కూడా జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక స్వ‌రం వినించాయి. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ ఈ ఉచ్చులో చిక్కుకోకుండా.. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు. అంతేకాదు.. ఈ విమ‌ర్శ‌ల ను ఆయన ప‌ట్టించుకోలేదు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ఇది ఆయ‌న‌ను ఏ రేంజ్‌లో గెలిపించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు.. జిల్లాల వారీగా.. టీడీపీని టార్గెట్ చేస్తున్న వైసీపీ.. టీడీపీకి ఉన్న‌ బ‌ల‌మైన నాయ‌కుల‌ను, జిల్లాల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న‌వారిని ఏదో ఒక రూపంలో మ‌ట్టి క‌రిపించి.. తన‌ను తాను బ‌లోపేతం చేసుకునే దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలోనే టీడీ పీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు విష‌యంలో వైసీపీ స‌ర్కారు. వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోంది. కీల‌క‌మైన మాన్సాస్ ట్ర‌స్టు, సింహాచ‌లం ట్ర‌స్టుల చైర్మ‌న్ ప‌ద‌వుల నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు. ఈ క్ర‌మంలో న్యాయ పోరాటం చేసిన గ‌జ‌ప‌తి రాజు.. వీటిని సాధించుకున్నా.. వైసీపీ మ‌రో వ్యూహంతో ఆయ‌న‌ను ఇబ్బంది పెడుతోంది.

నిన్న‌టి వ‌ర‌కు సంచ‌యిత‌.తో పోరు సాగ‌గా.. ఇప్పుడు మ‌రో కుటుంబ స‌భ్యురాలు.. ఊర్మిళ‌తోనూ గ‌జ‌ప‌తికి పోరు త‌ప్ప‌డం లేదు. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో క‌నిపిస్తున్న కీల‌క విష‌యం.. ఏంటంటే.. వైసీపీ రాజ‌కీయంగా కాకుండా.. మాన‌సికంగా.. గ‌జ‌ప‌తిరాజును ఇరుకున పెడుతోంది. దీంతో ఆయ‌న జిల్లా రాజ‌కీ యాల‌పై దృష్టి పెట్ట‌లేక పోతున్నారు. ఫ‌లితంగా జిల్లాలో టీడీపీ దూకుడు లేకుండా పోయింది. ఇదే వైసీపీ కూడా కోరుకునేది. అయితే.. ఈ విష‌యాన్ని అటు అశోక్ కానీ, ఇటు టీడీపీ కానీ.. గ‌మ‌నించ‌డం లేదు. దీంతో చాప‌కింద నీరులా.. వైసీపీ ప‌రుగులు పెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News