విశాఖపై జగన్ ఫోకస్...వారే ఎమ్మెల్సీలు...?

Update: 2021-11-12 09:30 GMT
పదవి రాజకీయాల్లో ఎపుడూ అలంకారప్రాయం కాదు, ప్రజలకు సేవ చేయడం అన్నది పక్కన పెడితే తమతో పాటు పార్టీ రాజకీయం కూడా మార్చే గట్టి పిండాలనే అధినాయకత్వాలు ఎపుడూ ఎంపిక చేస్తూంటాయి. మాట కోసమో, మంచి కోసమే పదవులు ఇచ్చే రోజులు పోయాయి. ఒకరికి పదవి ఇచ్చారు అంటే అక్కడ పార్టీ గట్టిగా ఉంచేలా ఆయన ఏం చేయగలడు అన్నదే ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటారు. ఇపుడు వైసీపీ కూడా అలాగే ఆలోచన చేస్తోంది. దాంతో విశాఖలో రెండు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం భారీ కసరత్తే చేస్తున్నారుట. అదే సమయంలో నిన్నటిదాకా వినిపీంచిన పేర్లు పోయి కొత్తవి తెర మీదకు వస్తున్నాయి.

విశాఖలో వైసీపీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం చూస్తే నగర అధ్యక్షుడు వంశీ క్రిష్ణ యాదవ్ కి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆయనకు ఇప్పటికే పార్టీ రెండు సార్లు హ్యాండ్ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు. ఇక ఈ ఏడాది మొదట్లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో ఆయనకు ఇస్తామన్న మేయర్ సీటుని కూడా ఇవ్వకుండా మహిళా నేతకు ఇచ్చారు. దాంతో ఎమ్మెల్సీ పదవి వంశీకి ఖాయమని అంతా భావించారు. కానీ ఇక్కడే ఇపుడు ఒక్కసారిగా లెక్కలు మారుతున్నాయి. ఈ మధ్యనే కడపకు చెందిన రమేష్ యాదవ్ అనే వైసీపీ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దాంతో ఆ సామాజిక కోటా భర్తీ అయినందువల్ల వంశీకి హుళక్కే అంటున్నారు. దాంతో పాటు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ప్రస్తుతం ఆయన కార్పోరేటర్ గా ఉన్న పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికను ఎందుకు తేవాలి అన్న ఆలోచన కూడా ఉందిట. ఇక వంశీ వల్ల సిటీలో వైసీపీకి పెద్దగా ఒనగూడే అదనపు రాజకీయ ప్రయోజనాలు ఏవీ లేవు అన్న లెక్కలు ఏవో ఉన్నాయట.

దాంతో ఆయన ప్లేస్ లో బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెర మీదకు వస్తోంది. ఆయన ఒకసారి ప్రజారాజ్యం, మరో సారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి విశాఖ రూరల్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న యువ‌ పారిశ్రామికవేత్త కూడా. పైగా ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే విశాఖ సిటీతో పాటు, జిల్లాలో ఉన్న కాపులను వైసీపీ వైపుగా ఆకట్టుకోవచ్చు అన్న ఆలోచన పార్టీ పెద్దలలో ఉందిట. ఇక ఇదే విశాఖలో రెండవ సీటుని రూరల్ జిల్లాకు చెందిన ఆడారి ఆనంద్ కి ఇవ్వలని కూడా చూస్తున్నట్లుగా భోగట్టా. ఆడారి ఆనంద్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిపోయారు. ఆయన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు. ఇక తులసీరావు టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉండి రూరల్ జిల్లాలో ఎన్నో సీట్లను గెలిపిస్తూ వస్తున్నారు. ఇపుడు ఆనంద్ ని ఎమ్మెల్సీ చేస్తే ఆ బలం తమ వైపునకు మళ్ళుతుంది అన్న ఆశ వైసీపీకి ఉందిట.

అదే విధంగా విశాఖ రూరల్ జిల్లాలో బలమైన గవర సామాజికవర్గానికి న్యాయం చేసినట్లుగా ఉంటుంది అంటున్నారు. ఈ సమీకరణలలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ఎక్కడా చాన్స్ లేనే లేదని అంటున్నారు. అలాగే విశాఖ రూరల్ జిల్లాకు చెందిన మహిళా నేత వరుడు కళ్యాణికి కూడా అవకాశాలు లేవనే చెబుతున్నారు. మొత్తానికి వైసీపీ కనుక ఈ డెసిషన్ తీసుకుంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది. అదే టైమ్ లో సమర్ధులకు, పార్టీకి ఉపయోగ పడేవారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అన్ని లెక్కలూ చూసుకునే జగన్ ఈ డెసిషన్ కి వచ్చారని అంటున్నారు. మొత్తానికి విశాఖలో వైసీపీ రాజకీయ పట్టుని మరింతగా పెంచుకోవడానికే జగన్ ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారు అంటున్నారు.




Tags:    

Similar News