సీఎం మహా అయితే ఏడాదే ఉంటారట..తేల్చేసిన కాంగ్రెస్ లీడర్

Update: 2019-08-27 05:46 GMT
కర్ణాటకలో ప్రస్తుతం సీఎం యడియూరప్ప మహా అయితే ఏడాది మాత్రమే అధికారంలో కొనసాగగలరని ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కన్నడ నాట  మధ్యంతర ఎన్నికలు తథ్యమని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.  ఎన్నికలు ఏడాదిలోగా ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన.. ఇప్పటి నుంచే ప్రజలకు సన్నిహితమయ్యే కార్యక్రమాలు చేపట్టాలని - ఆ విధంగా పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికలు ఏడాదిలోగా వస్తాయని చెప్పడానికి కారణం - యడియూరప్ప ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మకపోవడమేనని సిద్ధరామయ్య అన్నారు.   ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలతోనే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని - దాని మనుగడకు ఏ క్షణమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని సిద్ధరామయ్య అన్నారు.

మరోవైపు యడియూరప్పను అదుపులో పెట్టే లక్ష్యంతో ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించేందుకు బిజెపి కేంద్రనాయకత్వం సన్నద్ధం కాగా - తమ సీనియారిటీని గుర్తించలేదని అలక వహించిన ముగ్గురు సీనియర్‌ మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  బిజెపి అధిష్టానం ఉపముఖ్యమంత్రులుగా ముగ్గురిపేర్లను ప్రతిపాదించింది. వీరు ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన గోవింద కార జోళ - లక్ష్మణ సవది - దక్షిణ కర్ణాటకకు చెందిన డాక్టర్‌ సిఎన్‌.అశ్వత్థ నారాయణ. వీరిలో 'ఆపరేషన్‌ కమలం' సూత్రధారులైన అశ్వత్ధ్‌ నారాయణ - లక్ష్మణ సవదిలను పార్టీ అధిష్టానం ఎంపిక చేయగా - తన చిరకాల సహచరుడు గోవింద కారజోళను యడియూరప్ప ఎంచుకున్నారు.

దీంతో రగిలిపోయిన సీనియర్‌ మంత్రులు జగదీష్‌ శెట్టర్‌ (మాజీ ముఖ్య మంత్రి) కెఎస్‌.ఈశ్వరప్ప - ఆర్‌.అశోక్‌ (ఉప ముఖ్యమంత్రులు) సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మురళీధరరావును కలుసుకుని తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని చెప్పినట్లు సమాచారం.

దక్షిణకర్ణాటక పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగుల నాయకుడిగా వున్న తనను కాదని తాజాగా అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ అశ్వత్ద్‌ నారాయణకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తే తన పరిస్థితి ఏమిటని అశోక్‌ నిలదీశారని చెబుతున్నారు. అలాగే ఉత్తర కర్ణాటకలో అదీ ముంబాయి కర్ణాటకలో తాను మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తే ఇపుడు లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తే క్యాడర్‌ దృష్టిలో చులకన అవుతానని శెట్టర్‌ వాపోయినట్లు తెలిసింది. అసంతృప్తి తీవ్రమవుతుండడంతో యడ్డీ ప్రభుత్వంపై సిద్ధరామయ్య చెబుతున్న జోష్యం నిజమైనా కావొచ్చని భావిస్తున్నారు.


Tags:    

Similar News