పోలింగ్ వేళ.. రేపటి పచ్చ కుట్ర ఇదే.. సిల్లీ ఆడియో టేపులతో!

Update: 2019-04-07 16:59 GMT
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బలగం ఎంతకైనా రెడీ అవుతోంది. జనాలను సైకలాజికల్ గా కొట్టడానికి తెలుగుదేశం అనుకూల మీడియా తెగ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. అందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన సంభాషణ అంటూ సిల్లీ కుట్రలకు తెర లేపుతోంది తెలుగుదేశం అనుకూల మీడియా. ఆ కుట్రలకు సంబంధించిన ఆడియో ఫైల్స్ ముందుగానే బయటపడుతూ ఉన్నాయి.

రేపు అంటే.. సోమవారం రోజుకు తెలుగుదేశం అనుకూల పార్టీ కుట్ర ఏమిటో ఇప్పటికే తేటతెల్లం అవుతోంది. అందులో భాగంగా ఆదివారం రోజు రాత్రికే ఆ వ్యవహారానికి సంబంధించిన ఆడియో ఫైల్స్ వెబ్లోకి వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణగా చెబుతూ..ఒక పచ్చ కుట్రకు తెర తీశారు.ఇది సిల్లీ కుట్రే. ఈ కుట్రకు సంబంధించిన కథనమే తెలుగుదేశం పార్టీకి తోక పత్రికగా పేరు పొందిన పత్రికలో ప్రచురితం కాబోతూ ఉంది.

ఇంతకీ ఆ ఆడియోటేపు ఏమిటంటే.. ఎవరో అనామకులుగా చెప్పుకునే ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్టుగా ఆ ఆడియో టేపును క్రియేట్ చేశారు. వారిద్దరూ జగన్ కు వీరాభిమానులుగా చెప్పుకుంటారు అందులో. అయితే వాళ్లు మాట్లాడే మాటలన్నీ తెలుగుదేశంపార్టీ చేసే ఆరోపణలు నిజం అన్నట్టుగా ఉంటాయి. అదీ స్క్రిప్ట్.

‘జగన్ కు కేసీఆర్ డబ్బులు పంపించాడు. లోకేష్ ను, పరిటాల శ్రీరామ్ ను ఓడించడానికి కేటీఆర్ డబ్బులు పంపించాడు, ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి, అందుకోసమే సీఎస్ ను బదిలీ చేశారు, ఈవీఎంలను జగన్ కు అనుగుణంగా సెట్ చేశారు, తెలంగాణలో కేసీఆర్ అలాగే గెలిచాడు.. రేపు జగన్ కూడా అలాగే గెలుస్తాడు, పోలింగ్ లోపు మనం అల్లర్లను సృష్టించాలి.. అందు కోసం రెడీగా ఉండు..పీకే టీమ్ నుంచి ఆదేశాలు రాగానే అల్లర్లు చేద్దాం..’ అంటూ ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారట. అదే తెలుగుదేశం అనుకూల మీడియా రేపటి ప్రధాన కథనం అని తెలుస్తోంది.

అయితే అది పూర్తిగా క్రియేటెడ్ అని అందులోని వారి మాటలను బట్టి చూస్తే స్పష్టం అవుతుంది. అది కావాలని రికార్డు చేశారని, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై వారు జల్లుతున్న బురద నిజం అని నమ్మించడానికి ఆ ఆడియోను సృష్టించారని దాన్ని విన్నవారికి ఎవరికైనా స్పష్టం అవుతోంది.

అయితే పోలింగ్ వేళ ఏదో ఒకటి చేయాలి, జనాలపై సైకాలజికల్ గా ఏదో చల్లాలి, తెలుగుదేశం పార్టీ కేసీఆర్ నే నిందిస్తూ ఈ  ఎన్నికలను ఎదుర్కొంటోంది కాబట్టి, అదే నిజం అని వారిని నమ్మించే  ప్రయత్నంగా ఉంది ఆ ఆడియో కల్పిత స్టోరీ. అయితే మరీ సిల్లీగా అనిపిస్తున్న ఇలాంటి కుట్రలతో ప్రయోజనం ఏమిటి? అనేది దీన్ని క్రియేట్ చేసిన వారికే తెలియాలి!
Tags:    

Similar News