ప్రజాశాంతి పార్టీకి 90 - బీజేపీ 42 - కాంగ్రెస్‌ కు 40 సీట్లు

Update: 2019-04-09 04:26 GMT
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఇలాంటి కీలక తరుణంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో సంచలన సర్వే ఒకటి వెల్లడైంది. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు అంతర్జాతీయ ప్రముఖుడు కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ‘‘యెస్టర్‌ డేస్ కౌటిల్య’’ అనే సంస్థ వెల్లడించింది. బీజేపీ 42 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని.. కాంగ్రెస్ 40 సీట్లు సాధిస్తుందని.. టీడీపీ - బీజేపీ - జనసేనలు తలా ఒక్కో సీటు సాధిస్తాయని ఆ సర్వేలో తేలింది.
   
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పంలో - వైసీపీ అధినేత జగన్ పులివెందులలో - జనసేన అధినేత పవన్ గాజువాకలో విజయం సాధిస్తారని.. వారు తప్ప ఆయా పార్టీల్లో ఇంకెవరూ గెలవరని ఈ సర్వే వెల్లడించింది. కేఏ పాల్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎంతో మేలు చేసినందున ఆ పార్టీని ప్రజలు 42 సీట్లలో గెలిపిస్తారని.. అలాగే రాష్ట్రాన్ని విభజించి ఏపీకి న్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని సైతం 40 స్ఠానాల్లో ప్రజలు గెలిపిస్తారని ఆ సంస్థ తెలిపింది.
   
తమ సంస్థ సర్వేలకు మారుపేరని.. జనం నాడిని పట్టడంలో తమకు తామే సాటని.. పాకిస్తాన్ - సిరియా - ఉగాండా - బురుండీ - వాటికన్ సిటీ వంటి దేశాల్లో గతంలో తాము చేసిన సర్వేలు నూటికి నూట ముఫ్ఫయ్యారు శాతం నిజమయ్యాయని ఆ సంస్థ తెలిపింది. గత డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుందని తాము ముందే చెప్పామని.. అచ్చంగా అలాగే జరిగిందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కర్నాటకలో ఒక రాజకీయ నాయకుడు సీఎం అవుతారని తాము చెప్పామని.. తమ అంచనా కచ్చితంగా ఫలించిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
   
తాము సర్వే చేసే పద్ధతులే అలా ఉంటాయని.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సర్వే విషయానికొస్తే రోజూ రాత్రి కేఏ పాల్ ఫేస్‌ బుక్ లైవ్ చూసేవారు - ఏపీ బీజేపీ నేతల ట్వీట్లు చదివేవారు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాహుల్ గాంధీతో పెట్టించబోయే మొదటి సంతకాలు లిస్టు తెలిసినవారిని సర్వే చేశామని.. వారితో మాట్లాడాక ఈ సర్వే ఫలితాలు విడుదల చేస్తున్నామని చెప్పారు.

(ఈ కథనం పూర్తిగా వ్యంగ్య రచన.. ఏపీ ఎన్నికలకు - దేశంలోని ఏ ఒక్క సర్వే సంస్థకూ దీంతో ఎలాంటి సంబంధం లేదు)
Tags:    

Similar News