బీజేపీకి చావుదెబ్బ‌..కోట బ‌ద్ధ‌లైంది..యోగి పశ్చాత్తాపం

Update: 2018-03-14 13:45 GMT
అధికార బీజేపీకి అనూహ్య షాక్ త‌గిలింది. అది కూడా వారి ఇలాకా అయిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో అధికార బీజేపీకి చావుదెబ్బ త‌గిలింది. సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌ - డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య స్థానాలైన గోర‌ఖ్‌ పూర్‌ - ఫూల్‌ పూర్‌ ల‌లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ముఖ్యంగా ఐదుసార్లు ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి త‌న కంచుకోటగా మార్చుకున్న యోగికి ఈ ఓట‌మి అస్స‌లు మింగుడు ప‌డ‌నిదే. గ‌త ఏడాది సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ఆయ‌న రాజీనామా చేశారు. అటు బీహార్‌ లోనూ ఉప ఎన్నిక‌లు జ‌రిగిన మూడో స్థానాల్లో ఒక్క‌దాంట్లో మాత్ర‌మే బీజేపీ గెలిచింది. ఈ బ‌బువా స్థానంలో గ‌తంలోనూ బీజేపీ అభ్య‌ర్థే గెలిచారు. మిగ‌తా రెండు స్థానాల‌ను ఆర్జేడీ నిలుపుకుంది. ఈ రెండు విజ‌యాల‌తో ఎస్పీ - బీఎస్పీ కార్య‌క‌ర్త‌లు సంబరాల్లో మునిగిపోగా.. బీజేపీ షాక్‌ లో కూరుకుపోయింది. ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ ఊహించ‌ని షాక్‌ ను విశ్లేషించే ప‌నిలో ప‌డింది!

2014లో ఇదే లోక్‌ స‌భ స్థానం నుంచి యోగి.. ఏకంగా 3 ల‌క్ష‌ల 12 వేల‌కుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ నాలుగేళ్ల‌లోనే ప‌రిస్థితి పూర్తిగా తారుమారైంది. అంత మెజార్టీతో తాను గెలిచిన స్థానంలోనే ఇప్పుడు బీజేపీ అభ్య‌ర్థి ఓడిపోయారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఎన్నిక‌ల కోసం అటు స‌మాజ్‌ వాదీ - బ‌హుజ‌న్ స‌మాజ్‌ వాదీ పార్టీ చేతులు క‌ల‌ప‌డం బీజేపీ కొంప ముంచింది. ఇక‌ ఫూల్‌ పుర్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తన సమీప భాజపా అభ్యర్థిపై 59వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక గోరఖ్‌ పూర్‌ లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌.. భాజపా అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై విజయం సాధించారు. బీఎస్పీ ఓట్లు ఈ స్థాయిలో ఎస్పీకి వెళ్తాయ‌ని తాము ఊహించ‌లేద‌ని డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్‌ మౌర్య అన్నారు. ఈయ‌న రాజీనామా చేసిన ఫూల్‌ పూర్ స్థానంలోనూ బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌లేదు.

యూపీలోని గోరఖ్‌ పూర్ - ఫూల్‌ పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అతి విశ్వాసమే ఈ ఎన్నికల్లో తమ కొంప ముంచిందని ఆయన చెప్పారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించిన ఎస్పీ అభ్యర్థులు ప్రవీణ్ నిషాద్ (గోరఖ్‌ పూర్) - నాగేంద్ర పటేల్ (ఫూల్‌ పూర్)లకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు స్పష్టంచేశారు. చివరి నిమిషంలో ఎస్పీ - బీఎస్పీ చేతులు కలిపాయని - వాళ్ల ప్రభావం ఎన్నికలపై ఇంతలా ఉంటుందని ఊహించలేదని యోగి అన్నారు. వాళ్ల రాజకీయం బంధం దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించేదని విమర్శించారు. ఈ దుష్టకూటమికి వ్యతిరేకంగా తాము వ్యూహాలు రచిస్తామని కూడా యోగి స్పష్టంచేశారు. ఇక ఈ ఉప ఎన్నికల్లో జాతి ప్రయోజనాల కంటే స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావం చూపాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సాధారణ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉంటుందని అన్నారు. నాలుగేళ్లుగా ప్రధాని మోడీ పేదలు, అణగారిన వర్గాల కోసం ఎంతో చేశారని, సాధారణ ఎన్నికల్లో స్థానిక అంశాలను పక్కన పెట్టి ఓటర్లు తమకే పట్టం కడతారని యోగి తెలిపారు.

మ‌రోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఫలితాలపై స్పందించారు.  బీజేపీతో ప్రజలు విసిగిపోయారనే విషయం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందని రాహుల్ గాందీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం ఉన్న బీజేపీయేతర అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారని రాహుల్‌ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ లో తమ పార్టీ పునర్మిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే ఇది రాత్రికి రాత్రే జరిగే పని కాదని తెలిపారు.
Tags:    

Similar News