ఈ కాషాయ సీఎం కొత్త గొడవ సృష్టిస్తున్నాడే!

Update: 2017-08-14 04:20 GMT
ఇండియా అంటేనే సర్వమత సమ్మేళనం లాంటి దేశం. ప్రపంచవ్యాప్తంగా కనిపించే అనేక ఇస్లామిక ఉగ్రవాద వ్యవహారాలకు ఇండియాలో లింకులు దొరకవచ్చు గాక.. కానీ.. ఈ దేశానికి సంబంధించినంత వరకు ప్రతి ముస్లిమూ ఉగ్రవాదే అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన చాలా కీలకమైన విషయం ఇది. ఆ మతానికి సంబంధించిన వాళ్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు వారి మనోభావాలను ఏ రకంగానూ హర్ట్ చేయకుండా ఉండేలా ప్రభుత్వాలు వ్యవహరించాలి. కానీ ప్రస్తుతం యూపీలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం.. ముస్లింల్లో ఆవేదనకు కారణం అవుతోంది.

యూపీలో కూడా ముస్లింల జనాభా అలాగే వారి మతపరమైన విద్యాసంస్థలుగా గుర్తింపు ఉన్న మదర్సాల సంఖ్య కూడా ఎక్కువ. అయితే ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు మామూలు హిందూ స్కూళ్లలో లాగానే మదర్సాల్లో కూడా వేడుకలు నిర్వహిస్తారు. తాజాగా యోగి ప్రభుత్వం ఈ మదర్సాల్లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల మీద ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. మదర్సాల్లో జరిగే అన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వీడియో షూటింగ్ చేయించాలని నిర్ణయించింది. తద్వారా ఈ వేడుకల్లో దేశ వ్యతిరేక ప్రసంగాలు ఏమైనా జరుగుతాయేమోనని పసిగట్టడానికి అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే ఈ నిర్ణయం పట్ల ముస్లింలలో ఆగ్రహం - ఆవేదన వ్యక్తం అవుతున్నాయి. మా దేశభక్తిని అనుమానిస్తున్నారా... స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి ప్రతి ఏటా మదర్సాల్లో ఇండిపెండెన్స్ డేలు చేస్తూనే ఉన్నాం. కొత్తగా ఇదేమిటి అంటూ వారు బాధపడుతున్నారు.

అయినా ఇక్కడ కాషాయవస్త్రాలు ధరించే ముఖ్యమంత్రిగారు గుర్తించాల్సిన విషయం ఒకటుంది. వీడియో షూటింగ్ అంటూపెట్టిన తర్వాత ఆ రోజు ప్రసంగాల్లో వారు ఎలాంటి జాతి విద్వేషక ప్రసంగాలు చేయకపోవచ్చు. కానీ వారిలో ఆ భావజాలమే గనుక ఉంటే.. ప్రతిరోజూ చెప్పే పాఠాల్లోనే ఆ విషయం ప్రతిబింబించవచ్చు. కాబట్టి ముస్లింలను అనుమానంతో చూడడం కాదు..  వారిలో అలాంటి జాతి వ్యతిరేక భావాలే రాకుండా ఉండేలా.. మీరు మంచి పాలన అందించగలిగితే.. వారిలో మార్పు క్రమంగా అదే వస్తుంది అని పలువురు భావిస్తున్నారు. ఏ మతాన్ని అయినా సరే.. ఇలాంటి అనుమానపు దృష్టితో చూడడం.. తద్వారా ఆ మతస్తులందరిలో ఆవేదనకు  కారణం కావడం మంచిది కాదని అంటున్నారు.
Tags:    

Similar News