ప‌క్క‌రాష్ట్రంలో పంచాయ‌తీ పెట్టి యోగీ తెర‌కెక్కాడు

Update: 2017-10-05 09:37 GMT
అధికారం చేప‌ట్టింది మొద‌లు ప‌లు రకాల‌ వార్త‌ల‌తో - సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో తెర‌మీద‌కు వ‌స్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఆ ట్రెండ్‌ ను కొన‌సాగిస్తున్న‌ట్లున్నారు. దేశంలోనే అతిపెద్ద‌ - కీల‌క రాష్ర్టానికి సీఎంగా ఉన్న యోగి...ఓ చిన్న రాష్ట్రంలో వెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. దేవుడు న‌డ‌యాడిన నేల‌గా పేరున్న కేర‌ళ‌లో పార్టీ శ్రేణుల‌తో క‌లిసి పాద‌యాత్ర చేసి క‌ల‌క‌లం సృష్టించారు.  కేరళలో బీజేపీ - ఆరెస్సెస్ కార్యకర్తల వరుస హత్యలను నిరసిస్తూ బీజేపీ ‘జనరక్ష యాత్ర’ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. 15రోజుల పాటు నిర్వహించే యాత్రల్లో భాగంగా యాత్రలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళలో అధికార సీపీఎం పార్టీ జిహాదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని, తుపాకీ గురిపెట్టి అధికారాన్ని లాక్కోవడం వామపక్షాల స్వభావం అని వ్యాఖ్యానించారు.

కేరళలో అధికార పార్టీ ప్రేరణతో రాజకీయ హింస జరుగుతున్నదని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు.యాత్రలో అధికార సీపీఎం పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే, తుపాకులు ఎక్కుపెట్టి అధికారం లాక్కోవడం వామపక్ష పార్టీల నైతిక స్వభావం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఒకప్పుడు భగవంతుడు నడియాడిన నేల అనగానే కేరళను చూపించేవాళ్లం. ఇప్పుడు రాజకీయ హింస పెచ్చుమీరుతోన్న గడ్డ అనగానే కేరళను ప్రస్తావించాల్సి వస్తోంది’ అని అధికార పార్టీ వైఖరిపై ఆరోపణలు గుప్పించారు. ``డెంగ్యూ - చికెన్ గున్యా లాంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తినపుడు ఉత్తరప్రదేశ్ సమర్థంగా ఎదుర్కొంది. అలాంటి పరిస్థితే కేరళలోనూ ఎదురైతే, 300 మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది?`` అని చురకలు అంటించారు. పేదోడికి కనీస వైద్యం సైతం అందని దుస్థితి కేరళలో కనిపిస్తోందని మంండిప‌డ్డారు. బీజేపీ చేపట్టిన జన రక్ష యాత్రకు ప్రజలనుంచి భారీ మద్దతు లభిస్తోందని తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావులేదు. కానీ, దురదృష్టవశాత్తూ కేరళలో అదే కనిపిస్తోంది. అందుకు అధికార వామపక్ష పార్టీయే బాధ్యత వహించాలి. సిపిఐ (ఎం) దుష్టపాలనను ఈ యాత్రల ద్వారా బీజేపీ ఎండగట్టదలచుకుంది’ అని యోగి స్పష్టం చేశారు. .ఈ సందర్భంగా యోగి వివాదాస్పదమైన లవ్ జిహాద్ అంశాన్ని లేవనెత్తారు. లవ్ జిహాద్ ఒక ప్రమాదకరమైన ధోరణి అని, దానిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు.

మంగళవారం జన రక్ష యాత్రను ప్రారంభించిన అమిత్ షా, కేరళ అధికార ప్రభుత్వంపై తీవ్రస్థాయి విమర్శలు చేసన సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్ నిర్వహిస్తున్న రెండో రోజు యాత్రకి యోగి హాజరయ్యారు. పదిహేను రోజుల యాత్రలో ఒక్కోరోజు ఒక్కో పార్టీ ముఖ్యలు హాజరయ్యేలా పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కాగా, ఈ యాత్ర‌కు ముందు సీపీఎం తమ అధికార ట్విట్టర్ అకౌంట్‌ లో ``యూపీ సీఎం యోగీని కేరళ దవాఖానలను సందర్శించాలని ఆహ్వానిస్తున్నాం. వాటిని చూసి దవాఖానలను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలని కోరుతున్నాం`` అని పేర్కొంది.
Tags:    

Similar News