రైతులకు.. యోగి సర్కారుకు మధ్య రాజీ.. ఒప్పందం లెక్కలివే

Update: 2021-10-05 04:14 GMT
యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా నిరసన చేస్తున్న రైతుల మీద రెండు ఎస్ యూవీలు దూసుకెళ్లటం.. ఈ ఉదంతంలో నలుగురు రైతులు దుర్మరణం పాలు కాగా.. తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన రైతుల కారణంగా నలుగురు బీజేపీ కార్యకర్తలు మరణించినట్లుగా చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. లఖీమ్ పూర్ ఉదంతం అంతకంతకూ పెద్దది అవుతూ.. విపక్షలన్నీ ఏకమై విరుచుకుపడుతున్న వేళ.. యోగి సర్కారు కాస్త తగ్గింది. రాజీ చర్చల్ని షురూ చేసింది.

చివరకు ఒక ఫార్ములాను తయారు చేసి.. మరణించిన కుటుంబాలకు నష్ట పరిహారాన్ని అందించేందుకు ఓకే చేసింది. ఇందులో భాగంగా ఆందోళనల్లో మరణించిన నలుగురు రైతులు కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున భారీ నష్ట పరిహారాన్ని ఇవ్వనున్నారు. బాధిత కుటుంబానికి ఒకటి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నారు. గాయపడిన రైతులకు రూ.10లక్షల చొప్పున నష్ట పరిహారం ఇచ్చేందుకు యోగి సర్కారు ముందుకురావటంతో రైతులు తమ నిరసనను ముగించి.. మరణించిన రైతుల అంతిమ సంస్కారాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో ఈ ఉదంతంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని యోగి సర్కారు డిసైడ్ అయ్యింది. ఇక.. ప్రభుత్వం ప్రకటించిన పరిహరాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ సమక్షంలోనే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. మరోవైపు లఖీమ్ పూర్ హింసాకాండకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతంలో మంత్రికొడుకు స్వయంగా కారు నడుపుతున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా భారీ పరిహారాన్ని ఇవ్వటం ద్వారా.. కేసులు నమోదు చేసేందుకు ఓకే చెప్పటం ద్వారా ఈ తీవ్ర పరిణామ ప్రభావాన్నివీలైనంత తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పాలి.
Tags:    

Similar News