మోడీకి సైతం పంచ్ లు వేసే యోగి మరోసారి గెలుస్తారట.. చెప్పిందెవరంటే?

Update: 2021-07-10 05:30 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదిరించి మనగలిగే వారు ఉన్నారా? ఆయనకు సైతం ఇరుకున పడేసే టాలెంట్ ఎవరికైనా ఉందా? పంతం పట్టి మరీ మోడీని సైతం ఇబ్బంది పెట్టే వారున్నారా? లాంటి ప్రశ్నలకు అవునని చెబితే ఆశ్చర్యపోతారు. అయితే.. ఇలాంటి టాలెంట్ ప్రత్యర్థి పార్టీలో కాకుండా సొంత పార్టీకి చెందిన కీలక నేత కావటం ఇక్కడ అసలు ట్విస్టు గా చెప్పాలి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మోడీకి అపర విధేయుడన్నట్లుగా చెబుతారు కానీ.. అంత సీన్ లేదన్న బీజేపీకి చెందిన కీలక నేతలు చెప్పే కఠిన వాస్తవం. యోగి మాష్టారు ప్రధాని మోడీ మాటను తూచా తప్పకుండా పాటిస్తారనే మాటలో ఎలాంటి నిజం లేదని చెబుతారు. ఆయన అసలుసిసలు సంఘ్ పరివార్ మనిషి. అవసరమైతే మోడీని సైతం ఇరుకున పడేసే సత్తా ఆయనగారి సొంతమట. ఇటీవల పార్టీలో చోటు చేసుకున్న వైనాల గురించి తెలిస్తే ఇది నిజమనిపించక మానదు.

కరోనా సెకండ్ వేవ్ వేళ.. యోగి పని తీరుపై ప్రధాని మోడీ సానుకూలంగా లేరని చెబుతారు. అలా అని ఆయనపై చర్యల కత్తితో వేటు వేసే వీల్లేని సత్తా యూపీ సీఎం సొంతమని చెబుతారు. ఆ మధ్య ఇరువురు నేతల మధ్య నడిచిన పంచాయితీలో.. యోగిని బుజ్జగించి.. ఆయన్ను ఢిల్లీకి పంపటానికి పడిన పాట్లు అన్ని ఇన్ని కావని చెబుతారు. ఈ ఎపిసోడ్ లో ప్రధాని మోడీనే ఒక అడుగు వెనక్కి వేయాలని చెబుతారు. అలాంటి యోగి మరికొద్ది నెలల్లో కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి? బీజేపీ బలానికి.. వారికున్న అధికార ధీమాకు పెట్టని కోటగా ఉన్న యూపీలో ఏ మాత్రం తేడా వచ్చినా.. మోడీ సర్కారు సైతం ఇరుకున పడటం ఖాయమన్న వాదన ఉంది. అందుకే.. యూపీ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు బీజేపీ నేతలు. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడిన ఒక పోల్ సర్వే బీజేపీ నేతల్ని ఖుషీ చేసేలా ఉంది. అదే సమయంలో యోగి టాలెంట్ ఏ స్థాయిలో ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.

కొద్ది నెలల్లో యూపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ మరోసారి యూపీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం ఖాయమన్న వైనాన్ని స్పష్టం చేసింది ఐఏఎన్ఎస్-సి ఓటరు సర్వే. వారు నిర్వహించిన పోల్ సర్వేలో 52 శాతం మంది యోగిదే సీఎం పీఠం అని తేల్చేస్తున్నారు. ఇంతమంది మద్దతు ఉన్నప్పటికీ.. 37 శాతం మంది మాత్రం ఆయన అధికారంలోకి రాలేరని చెప్పినట్లు వెల్లడించింది.

కరోనాను సమర్థంగా డీల్ చేసే విషయంలో యోగి సర్కారు పెయిల్ కావటం.. గంగా నదిలో కరోనా డెడ్ బాడీలు కొట్టుకొచ్చిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ లో ఆయన పాలనా తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలోనూ యోగికి అధికారం కట్టబెట్టే విషయంలో 52 శాతం మంది ఓకే చెప్పటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ సర్కారు చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న దానిపైనా సర్వే నిర్వహించారు. మొత్తం 1200 మంది అభిప్రాయాల్ని సేకరించి.. విశ్లేషించిన ఈ శాంపిల్ లో.. కొత్త కాబినెట్ తో దేశంలో పరిస్థితులు మెరుగు పడతాయని 46 శాతం మంది అభిప్రాయపడితే.. 41  శాతం మంది పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేయటం విశేషం. మరి.. ఈ సర్వే ఫలితం ఎంతవరకు సరైనదన్న విషయం కాలమే తగిన సమాధానాన్ని ఇస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News