ఆర్ బీఐ సంచలనం..ఆన్ లైన్ లావాదేవీలు కార్డులతో ఇక కుదరదు

Update: 2020-03-14 18:30 GMT
ఇవాల్టి రోజున క్రెడిట్ కార్డులు లేనోళ్లు తక్కువే కనిపిస్తారు.  కాకుంటే.. నగరాలతో పోలిస్తే.. పట్టణాలు.. ఒక మోస్తరు ఊళ్లల్లో క్రెడిట్ కార్డులు పెద్దగా కనిపించవు. కానీ.. ఆ ఊరు ఈ ఊరు అన్న తేడా లేకుండా మాత్రం డెబిట్ కార్డులు అందరి చేతుల్లోనూ కనిపిస్తాయి. ఈ కార్డులతో ఆన్ లైన్ లావాదేవీల్ని సులువుగా చేస్తున్న పరిస్థితి.

అయితే..డెబిట్.. క్రెడిట్ కార్డులతో ఆన్ లైన్ తో పాటు ఇతర సేవల్ని చేస్తున్న వైనం.. దీని కారణంగా ఆన్ లైన్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్ బీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం.. మార్చి 16 నుంచి మీ కార్డుల్ని ఆన్ లైన్ వ్యవహారాలకు ఉపయోగించుకునేందుకు సాధ్యం కాదని చెబుతున్నారు.

మీ దగ్గరున్న కార్డుల్ని డొమెస్టిక్ లావాదేవీలు చేసేందుకు మాత్రమే అనుమతిని ఇస్తారు. అంటే.. ఏటీఎం.. పాయింట్ ఆఫ్ సేల్(సూపర్ మార్కెట్లు.. మాల్స్.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. వాణిజ్య సంస్థలు) వద్ద మాత్రమే అనుమతిస్తారు.

బ్యాంకింగ్ మోసాలతో పాటు.. ఆన్ లైన్ అవకాశాన్ని అసరా చేసుకొని డబ్బులు దోచేస్తున్న ముఠాలకు చెక్ పెట్టేలా ఆర్ బీఐ తాజా నిర్ణయం ఉందని చెబుతున్నారు. ఆన్ లైన్ తో పాటు.. అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకునే వినియోగదారులు తప్పనిసరిగా బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా ఆన్ లైన్ లో కొనుగోళ్లు.. చెల్లింపులు జరిపే అవగాహన ఉన్న వారు మాత్రమే వీటి కోసం అనుమతి తీసుకుంటారు. ఈ కొత్త నిర్ణయంతో ఆన్ లైన్ మోసాల్ని సగానికి పైనే తగ్గించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News