చిల్ల‌ర నోట్ల‌తో కారు కొనేశారు

Update: 2016-12-12 12:11 GMT
పెద్ద నోట్ల రద్దు తర్వాత అనేకానేక చిత్రాలు వెలుగులోకి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే..ప్రజలంతా చిల్లర కొరతతో ఇక్కట్లు పడుతుంటే నలుగురు యువకులు మాత్రం తమ వద్ద భారీగా ఉన్న రూ.10, రూ.20 నోట్లను దర్జాగా ఖర్చుపెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లా మలక్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు యువకులు నవంబర్ 19వ తేదీన స్థానిక ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు. రూ.10 లక్షల విలువైన రూ.10, రూ.20 నోట్లను దోచుకుని దర్జాగా ఖర్చుపెడుతున్నారు. మొత్తం రూ.10 నోట్లతోనే ఓ కారును సైతం కొన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతుండటంతో చుట్టుపక్కల ఉండేవారికి అనుమానం వచ్చింది. స్థానికుల సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదిలాఉండ‌గా...డిజిటల్ లావాదేవీలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ, సలహాలు, సూచనలు అందించడంతోపాటు, ఈ-పేమెంట్స్‌పై ప్రచారానికి కేంద్రం త్వరలో 14444 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి క్యాష్ ముక్త్ అభియాన్ హెల్ప్‌లైన్ నంబర్ అని పేరుపెట్టనున్నట్టు సమాచారం. మరో వారంలో ఇది అందుబాటులోకి రావచ్చని తెలిసింది. నాస్కామ్ ఐటీ విభాగం అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ "డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం మా సాయం కోరింది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా 14444 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవాలని మేం సూచించాం. ఇందుకు మేము ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో కాల్‌సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. కొత్తగా ఈ-పేమెంట్స్ ప్రారంభించిన వినియోగదారుడి నుంచి ప్రతి ఒక్కరికీ సేవలు అందించనున్నాం. వారు ఏ మొబైల్ వాడుతున్నారు? బ్యాంక్ ఖాతా ఉందా లేదా ఆధార్ నంబర్ ఆధారంగా లావాదేవీలు జరుపుతున్నారా?.. ఇలా పలు కోణాల్లో పరిశీలించి సరైన సలహాలు అందించాలని భావిస్తున్నాం" అని అన్నారు.

మ‌రోవైపు ప్రజలకు అవగాహన కల్పనకు కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖడిజిశాల అనే చానల్‌ను ప్రారంభించింది. ఇది దూరదర్శన్ డీటీహెచ్‌లలో, క్యాష్‌లెస్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నది. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, నోట్లరద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలు 400 నుంచి 1000 శాతం పెరిగాయని చెప్పారు. మరోవారం రోజుల్లో టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Tags:    

Similar News