రాజకీయ లెక్కల్లో జగన్ మరీ ఇంత వీకా?

Update: 2016-01-07 17:37 GMT
కొద్దికాలంగా స్తబ్దుగా  ఉన్న ఏపీ రాజకీయాల్లో రెండు రోజుల కిందట జరిగిన ఓ పరిణామంతో ఒక్కసారిగా స్పీడయ్యాయి. జగన్, దాసరి నారాయణరావుల భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పెంచింది. జగన్ ఆయన్ను తన పార్టీలోకి ఆహ్వానించడం.. ఆయన కూడా జగన్ ను పొగిడేయడం వంటివన్నీ చర్చనీయాంశమయ్యాయి. దాసరి వైసీపీలో చేరుతారని అంతా భావిస్తున్నారు. అయితే.... ఈ వ్యవహారంలో జగన్ సరైన అంచనాలు లేకుండా దాసరిని అప్రోచ్ అయ్యారని... ఆయన వల్ల జగన్ కు జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దాసరి-జగన్‌ల భేటీ నేపథ్యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాపుల ఓట్ల కోసమే దాసరిని జగన్ గోకుతున్నారని... అందుకోసం ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి కూడా జగన్ రెడీగా ఉన్నారని చెబుతున్నారు. టీడీపీ-బీజేపీలకు కాపు ఓట్లు సాధించిపెడుతున్న పవన్ కళ్యాణ్ కు పోటీగా దాసరిని రంగంలోకి దింపాలన్నది జగన్ ప్లానుగా చెబుతున్నారు. అయితే...  జగన్‌ నిర్ణయంపై రాజకీయవర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. జగన్‌ లాభనష్టాలను బేరీజు వేసుకోలేకుండా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  పవన్, దాసరిలు ఇద్దరూ కాపు నేతలే అయినా... పవన్  కు దాసరి సరితూగరని, ఆయన కు ఇప్పుడు పెద్దగా ఇమేజి కూడా లేదని.. ఆయన వల్ల ఎలాంటి లాభం ఉండదని అంటున్నారు. పైగా కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన దాసరి ఒకవేళ వైసీపీలో చేరినా లేక వైసీపీకి మద్దతిచ్చినా జగన్‌ నుంచి ఆయన ఎక్కువగా ఆశిస్తారని... దాంతో  దాసరి వల్ల కలిగే లాభం కంటే ఆయనకు వైసీపీ వల్ల కలిగే లాభమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు.  

దీంతోపాటు ఇంకో మైనస్ కూడా ఉంది. ఇప్పటికే వైసీపీకి, జగన్ కు అక్రమాల, అవినీతి పార్టీ, నేతలుగా పేరుంది. ఇప్పుడు దాసరిది కూడా అదే పరిస్థితి. ఆయన బొగ్గు కుంభకోణంలో పీకల వరకు కూరుకుపోయారు. అలాంటి వ్యక్తికి పిలిచి పీట వేస్తే వైసీపీకి ఇప్పటికే ఉన్న చెడ్డపేరు స్థిరపడిపోయే ప్రమాదమూ ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా జగన్ దాసరి విషయంలో ప్రొసీడవుతున్నారంటే అది ఆయన అంచనాల్లో లోపమేనని పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News