విశ్వ‌స‌నీయ‌త లేని..మాన‌వీయ‌త మ‌ర్చిన బాబు

Update: 2018-01-01 16:54 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం మానవీయతను మరచిపోయిందని - విశ్వసనీయతకు పాతర వేస్తూ పాలన కొనసాగిస్తోందని ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. విశ్వసనీయత అనే పదాన్ని రాజకీయ నేతలు మర్చిపోయారని - మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చినతిప్ప సముద్రం లో చేనేతలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రతి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని, నష్టపోయిన వారికి భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు కొడతారేమో అనే భయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ తన పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తీసేసిందని ఆయన అన్నారు.

నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మిగిలింది ఏంట‌నే ఆవేద‌న ప్ర‌జ‌ల్లో ఉంద‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. ` మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు ఊదరగొడుతున్నారు. ఆయన పాలన చూసిన తరువాత మనమంతా మన మనసాక్షిని  అడగాలి,  ఆయన పాలనను చూసిన తరువాత  మనం ఎవరైనా సంతోషంగా ఉన్నామని గుండెలపై చేయి వేసుకుని అడగాలి. రైతులు - చేనేత కార్మికులు సంతోషంగా లేరు - అక్క చెల్లెమ్మలు - చదువుకునే పిల్లలు - ముసలి వయసుల్లోని అవ్వాతాతలు ఏమాత్రం సంతోషంగా లేరు. నాలుగేళ్ల ఈ పాలన చూసిన తరువాత చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చేనేత రంగాలకు ఎన్నో చెప్పారు. ప్రతి పేజీలోనూ ఏదో ఒక కులాన్ని, ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసేట్లుగా ఉంది. ఇప్పుడు అది కనిపించి ఎవరైనా చదివితే - తరువాత కొడతారోమేన్న భయంతోనే వెబ్ సైట్లో నుంచి తీసేశారు` అంటూ వైఎస్ జ‌గ‌న్ ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎన్నికల ప్రణాళికలో చంద్రబాబు  ఏం చెప్పారో ఈ సందర్బంగా వైఎస్ జగన్ చదివి వినిపించారు. రాజకీయాలంటే విశ్వసనీయత అని కాని - చంద్రబాబు నాయుడు దానిని మరచిపోయారని మండిపడ్డారు. రాజకీయ నాయకుడు ఫలానా చేస్తానని చెప్పి - చేయకపోతే - అతని రాజీనామా తీసుకుని ఇంటికి పంపించాలి. చంద్రబాబు నాయుడు విశ్వసనీయతకు పాతర వేశారని ఆరోపించారు. `ఎన్నికలు వచ్చేసరికి మగ్గం ముందు కూర్చుని నేతన్నలను - చంకలో ట్యూబులో వేసుకుని గౌడన్నలపై తనకెంతో ఆప్యాయత సానుభూతి ఉందంటూ ప్రేమ ఒలకపోస్తారు. బుట్టలు అల్లుకునే వారితోపాటు రోడ్డు పక్కనే కూర్చుని బుట్టలు అల్లడం మొదలెడతారు. ఇలా అందరినీ మోసం చేయడమే చంద్రబాబు పని` అని అన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక ఇచ్చి 4 ఏళ్లు అయ్యింది. ఏమైనా మంచి జరిగిందా  చెప్పాలంటూ ప్రశ్నించారు.  చేనేత కార్మికుల బ్యాంకు రుణాల మాఫీ - పవర్ రూమ్  పై రుణాల రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలై మీ రుణాలు మాఫీ అయ్యాయా? చెప్పాలని ప్రశ్నిస్తే లేదంటూ సభికుల నుంచి సమాధానం వచ్చింది. ఇంతే కాకుండా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనీ - చేనేత కార్మికులకు ప్రత్యేక నిధి - బడ్జెట్ లో వెయ్యి కోట్ల నిధి ఎక్కడైనా కనిపించాయా? జిల్లాకో చేనేత పార్కు అన్నారు, ఏమయ్యాయి?. ఎక్కడైనా ఏర్పాటు చేశారా? లక్షన్నర తో ఉచితంగా ఇళ్లు - షెడ్ కట్టిస్తామన్నారు మీలో ఒక్కరికైనా కట్టించారా? చెప్పాలని అడిగారు.ఇవన్నీ మచ్చుకకు చంద్రబాబు మ్యానిఫెస్టో నుంచి  కొన్ని మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానన్నారు.

చేనేత కార్మికుల బ్యాంకు లోన్లు మాఫీ చేయలేదని జ‌గ‌న్ మండిప‌డ్డారు. `బడ్జెట్ లో ప్రతి ఏటా వెయ్యికోట్లు అన్నారు.ఇచ్చారా? చంద్రబాబు నాయిడి పుణ్యాన  పట్టుమీద వచ్చే రూ. 600 సబ్సిడీ పోయింది.  చంద్రబాబు పుణ్యమా అని చేనేతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది. నాలుగేళ్లలో చేనేతల ఆత్మహత్యలు పెరిగాయి. మదనపల్లిలోనే చేనేత కార్మికులు  28 మంది చనిపోయారు.  ధర్మవరం 35 మంది - మీరందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూసి మీకు మనసాక్షి  లేదా అని ప్రశ్నిస్తే  - ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేందంటూ బాబు అసెంబ్లీలో చెపుతారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు ఇవ్వడానికి మనసు ఒప్పక - అసలు రైతుల - చేనేతల ఆత్మహత్యలనే రికార్డు చేయడం లేదు. ఇచ్చే సహాయం కూడా మొదట అప్పుల వాళ్లకు - మిగిలిన దానిని బ్యాంకుల్లో డిపాజిటు చేసి - దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే ఆ కుటుంబాలకు అందచేయడమనేది దారుణమన్నారు. మానవత్నాన్ని మరచి పోయారీ ప్రభుత్వంలో అన్న దానికి ఇంతకంటే నిదర్శనమేం కావాలి?` అని సూటిగా అడిగారు. చేనేతలకు ప్రతి జిల్లాలో చేనేత పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పారని పేర్కొంటూ ఆ హామీని అట‌క ఎక్కించార‌ని మండిప‌డ్డారు.

పార్టీ తరపువ ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా చేనేత రంగానికి ఏమేమీ కావాలో అవన్నీ పొందపరుస్తామని వైఎస్ జ‌గ‌న్‌ హామీ ఇచ్చారు. బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూరింది మహానేత వైఎస్ ఆర్ హయాంలోనే అని - ఆయన కొడుకుగా మరో రెండు అడుగులు ముందుకెళ్లి  సంక్షేమ రంగాన్ని కొంత పుంతలు తొక్కిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా తొమ్మిది కీల‌క హామీల‌ను జ‌గ‌న్ ఇచ్చారు.

1. చేనేత కార్మికులను ఆదుకుంటాం.

2. తక్కువ వడ్డీకే రుణాలు అందజేస్తాం.

3. నూలుపై సబ్సిడీ చెల్లిస్తాం

4. అర్హులైన ఎస్సీ - ఎస్టీ - బిసి - మైనార్టీ (బడుగు బలహీన వర్గాల ) పేదలందరికీ 45 ఏళ్లకే  పింఛన్లు

5. ఫింఛన్‌ వెయ్యి నుంచి రూ.2 వేలు పెంచుతాం

6 అన్ని వర్గాలకు అండ‌గా ఉంటా. అందుకే 45 ఏళ్లకే పింఛను.

7. ఆరోగ్యశ్రీని పునరుద్ధిస్తాం. హైదరాబాద్ లోనూ ఆరోగ్యశ్రీ అమలు చేస్తాం.

8 పేదవాళ్లకు ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించటంతో పాటు వారికి పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందజేస్తాం.

9 .పిల్లలు చదువుకుంటేనే బతుకులు మారుతాయి. విద్యార్థులు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాం. ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు ప్రతి ఏటా 20వేలు మెస్ ఛార్జీలు చెల్లిస్తాం.
Tags:    

Similar News