ఆసుప‌త్రి నుంచి జ‌గ‌న్ డిశ్చార్జ్!

Update: 2018-10-26 08:31 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌గ‌న్ ను విప‌రీతంగా అభిమానించే వారు.. ఆరాధించే వారు.. వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే వారంద‌రికి సాంత్వ‌న క‌లిగించే అంశమిది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన హ‌త్యాయ‌త్నంలో గాయ‌ప‌డిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హైద‌రాబాద్‌లోని సిటీ న్యూరో సెంట‌ర్ లో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.  టీడీపీ కార్య‌క‌ర్త‌గా భావిస్తున్న శ్రీ‌నివాస్ జ‌రిపిన దాడిలో గాయ‌ప‌డిన జ‌గ‌న్ కు వైద్యులు చికిత్స చేయ‌టం తెలిసిందే.

చిన్న‌పాటి శ‌స్త్ర‌చికిత్స జ‌రిపి.. ఆయ‌న్ను విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు చెప్పారు. జ‌గ‌న్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉండ‌టంతో ఈ రోజు మ‌ధ్యాహ్నం 1.10 గంట‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ను డిశ్చార్జ్ చేశారు.జ‌గ‌న్ ఆరోగ్య ప‌రిస్థితిలో ఎలాంటి ఇబ్బంది లేద‌ని. ఆయ‌న ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష‌ల‌కు పంపిన వాటి ఫ‌లితాలు ఈ రోజు సాయంత్రానికి వ‌చ్చే వీలుంద‌ని చెబుతున్నారు.

బంజారాహిల్స్ రోడ్డు నెంబ‌రు 12లో ఉన్న సిటీ న్యూరో సెంట‌ర్లో జ‌గ‌న్ కు వైద్య సేవ‌ల్ని అందించారు. ఇదిలా ఉండ‌గా ఈ రోజు ఉద‌యం ఏపీ నుంచి వ‌చ్చిన సిట్ అధికారులు జ‌గ‌న్ తో మాట్లాడారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిపై ఆయ‌న స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వైద్యుల సూచ‌న‌ల ప్ర‌కారం జ‌గ‌న్  క‌నీసం ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ను చూసేందుకు.. ఆయ‌న తాజా ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున జ‌గ‌న్ అభిమానులు సిటీ న్యూరో ఆసుప‌త్రి వ‌ద్ద‌కు చేరుకోవ‌టంతో ఆ ప్రాంత‌మంతా తీవ్ర‌మైన ట్రాఫిక్ జాం నెల‌కొంది. జ‌గ‌న్ అభిమానులు విప‌రీతంగా రావ‌టం.. జ‌గ‌న్ ఆరోగ్య‌ప‌రిస్థితి బాగుంద‌ని చెబుతూ..డిశ్చార్జ్ చేయ‌టంతో భారీగా రిలాక్స్ ఫీల్ కావ‌టం క‌నిపించింది.


Tags:    

Similar News