పార్టీ ఆవిర్భావం.. ఉద్వేగానికి లోనైన జగన్

Update: 2020-03-12 07:48 GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పీఠం ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి ఇస్తారని అందరూ భావించగా అప్పుడు రోశయ్య, అనంతరం కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడంతో పాటు తన తండ్రి మరణంతో మనస్తాపానికి గురై హఠన్మరణం పొందిన వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించలేదు. దీంతో వెంటనే తనతో పాటు తన తల్లి కొంతమంది నాయకులతో కలిసి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. కొన్నాళ్లు పాదయాత్ర చేసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకారం చుట్టారు. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీగా తన తండ్రి పేరు వచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. అలాంటి పార్టీ నేడు గురువారం ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటోంది. ప్రస్తుతం పదో వసంతంలోకి అడుగు పెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుండడం విశేషం. ప్రధానంగా ఈ పార్టీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో ఆవిర్భవించింది.

ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. 'వైఎస్సార్‌ సీపీ 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులు, ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని ఆయన ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా పార్టీ జెండావిష్కరించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

పదేళ్ల వైఎస్సార్ పార్టీ ప్రస్థానం

- 2009 సెప్టెంబర్ 2వ తేదీన తండ్రి ముఖ్యమంత్రి వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణం.
- ఆయన మరణంతో తదుపరి సీఎం జగన్ అని అందరూ భావించారు. ఈ మేరకు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని దాదాపుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. దానికి పార్టీ అధిష్టానం తిరస్కరించి ఆర్థిక మంత్రిగా ఉన్న

రోశయ్య ముఖ్యమంత్రిగా నియామకం.
- ఆ తర్వాత జగన్ ను పక్కన పెట్టడం ప్రారంభమైంది. తన తండ్రి మరణంతో ఆత్మహత్యకు పాల్పడిన, మనస్తాపంతో గుండెపోటుకు గురైన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభం. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యతిరేకించింది. ఇది జగన్ ను తీవ్రంగా కలిచివేసింది.
- 2010 నవంబర్ 29వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.
- 2011 మార్చి 12వ తేదీన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపన.
- ఆ సమయంలో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు. రెండు లోక్ సభతో పాటు 18 అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల విజయం సొంతం.
- మొదటి అడుగే బలంగా పడడంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు.
- ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజల్లో మధ్య నిరంతరం ఉన్నాడు. ఆ సమయంలోనే రాష్ట్ర విభజన జరిగింది. సమైక్యాంధ్రకు జగన్ ఓటేయడంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు ఆయన పరిమితమయ్యాడు.
- 2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన జరగడంతో కొంత వైఎస్సార్‌ సీపీపై ప్రభావం పడింది. సీనియర్ నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ప్రజలు మొగ్గు చూపార. ఆ సమయంలో కొన్ని సీట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
- 2014 నుంచి 2019 దాక చంద్రబాబు ప్రభుత్వానికి పక్కల బల్లెంలా జగన్ ఉన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగట్టాడు.
- ప్రధానంగా ప్రత్యేక హోదాను పట్టుకుని ఉద్యమం చేశాడు.
- ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అనూహ్యంగా 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని పార్టీ అద్భుతం సృష్టించింది. దీంతో ముఖ్యమంత్రి కలను తొమ్మిదేళ్లకు జగన్ సాధించాడు.



Tags:    

Similar News