జగన్ ను హీరో చేస్తున్న చంద్రబాబు

Update: 2017-01-18 16:47 GMT
రాజకీయాల్లో అన్నింటికంటే ముఖ్యమైంది.. కీలకమైన అంశాలు రెండు. ఒకటి అహంకారం ఉన్నట్లుగా కనిపించటం.. రెండోది.. అధికార దర్పం ప్రదర్శించటం. మిగిలినవి ఎలా ఉన్నా.. ఈ రెండూ ఉన్న వారిని ప్రజలు ఏ మాత్రం ఇష్టపడరు. నిజానికి ఇలాంటి విషయాలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగానే తెలిసి ఉండాలి. తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన..ఈ రోజు పవర్ లో ఉన్నారంటే.. నాడు అధికారపక్షం చేసినతప్పులేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ.. బాబు తాజా తీరు చూస్తే.. అందుకు భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధం కావటం తెలిసిందే. అయితే.. ఆ ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయనకు పరిమితులు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది. స్వయంగా విపక్ష నేత పర్యటించాలనుకున్న ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకోవటం.. పరిమితులు విధించటం ప్రజల్లో నెగిటివ్ సంకేతాల్ని పంపిస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అంతేకాదు.. జగన్ తాజా అమరావతి పర్యటన సందర్భంగా ఆయన ఏయే ప్రాంతాల్లో పర్యటించాలన్న విషయాన్ని అధికారులు సిద్ధం చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వర్గం అనుకున్న రూట్ మ్యాప్ కు నో చెప్పిన పోలీసు అధికారులు.. తాము చెప్పిన మార్గంలోనే వెళ్లాలని షరతు పెట్టటంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

రాజధాని బాధిత రైతుల్ని పరామర్శించాలని విపక్ష నేత అనుకున్నప్పుడు అనుమతి ఇవ్వకపోవటం ఏమిటంటూ వారు నిలదీస్తున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం అమరావతి పరిధిలోని నిడమర్రు నుంచి జగన్ తన పర్యటనను షురూ చేయాలని భావించారు. లింగాయపాలెంకు చేరుకొని బాధితుల్ని పరామర్శించాలని అనుకున్నారు. అయితే.. అందుకు భిన్నంగా జగన్ పర్యటనకు ఆంక్షలు విధించటం ద్వారా జగన్ కు ప్రజల్లో సానుభూతి వెల్లువెత్తే అవకాశాన్ని బాబుసర్కారు ఇస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ రోజు బాబు చేస్తున్న తప్పులు.. భవిష్యతులో ఆయనకు చుట్టుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత పర్యటనకు ఆంక్షలు విధించటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ప్రతికూల భావం పడేలా చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఈ తరహా నిర్ణయాలు భవిష్యతులో దిద్దుకోలేని తప్పులుగా బాబుకు మారతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News