కేసీఆర్ కు ఛాన్స్ ఇవ్వలేదు కానీ జగన్ కు ఇచ్చిన మోడీ సర్కార్

Update: 2019-08-17 06:58 GMT
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రం రాజీ లేకుండా కేంద్రం మీద పోరాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగానే కాదు.. జగన్ పని తీరుకు దక్కిన అవకాశంగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేంద్రం నియమించే కీలక కమిటీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు చోటు దక్కలేదు. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం చోటివ్వటం గమనార్హం.

రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాల దర్యాప్తు.. సలహాల కోసం అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చోటు లభించింది. కేంద్ర హోంమంత్రిగా వ్యవహరిస్తున్న అమిత్ షా అధ్యక్షుడిగా ఉండే ఈ కమిటీలో మొత్తం 13 మంది కూడిన స్టాండింగ్ కమిటీ ఉంటుంది. వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరిలో అధికార బీజేపీ ముఖ్యమంత్రులే అధికం. అయితే.. బీజేపీయేతర ముఖ్యమంత్రులు నలుగురిని ఎంపిక చేస్తే.. ఆ నలుగురిలో ఏపీ సీఎం జగన్ ఒకరు కావటం విశేషం.

కమిటీలో ఉన్న బీజేపీ యేతర ముఖ్యమంత్రుల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. బిహార్ సీఎం నితీశ్ కుమార్.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంపిక చేశారు. ఈ కమిటీకి ప్రధాని మోడీ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంపిక చేయకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నియమించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర.. రాష్ట్ర సంబందాలపైనా.. పలు నిర్ణయాల పైనా నిరంతరం సంప్రదింపులు జరుగుతుంటారు. ఇలాంటి కీలక కమిటీలో జగన్ కు చోటు దక్కటం గమనార్హం.
Tags:    

Similar News