పెట్టుబడుల పేరుతో బాబు చేసిన తప్పును కరెక్ట్ చేస్తున్న జగన్

Update: 2019-09-27 06:06 GMT
నాణెనికి బొమ్మ ఎలానో బొరుసు కూడా ఉంటుంది. వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టేస్తున్నారంటూ ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన తప్పును తాజాగా సీఎం జగన్ మోహన్ కరెక్ట్ చేసే ప్రయత్నానికి తెర తీశారు. కోట్లాది రూపాయిలు పెట్టుబడులు వస్తున్నాయి కదా అని కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు అనుమతి ఇవ్వలేం కదా? అంటూ అసలు విషయాన్ని చెప్పేసిన జగన్ మాటలు కొత్తగానే కాదు.. ఇంతకాలం మిస్ అయిన కీలక పాయింట్ ఇదే కదా? అన్న భావన కలుగక మానదు.

పెట్టుబడులు పెడతామంటూ ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నామే కానీ వాటి నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడుతుందనే ఆలోచన చేయట్లేదని.. ఈ పరిస్థితి మారాలని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ విషయంలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని.. అదే సమయంలో పారిశ్రామికవేత్తలకు తాము వేధింపులకు గురి అవుతున్న భావన కలుగనీయకూడదన్న జాగ్రత్తను జగన్ చెప్పారు.

ఏపీలోని ఫార్మా కంపెనీల నుంచి వెలువడే లక్ష టన్నుల వ్యర్థాల్లో 30 శాతాన్నే శుద్ధి చేస్తున్నారని.. మిగిలింది యధాతథంగా వదిలేస్తున్నారన్న దారుణ నిజాన్ని జగన్ చెప్పారు. అందుకే.. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. అదే సమయంలో సదరు కంపెనీలకు గ్రీన్ ట్యాక్స్ విధిస్తామని చెప్పారు.

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని ఆదేశించారు.  కాలుష్య నియంత్రణలో వివిధ దేశాల్లో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల్ని అధ్యయనం చేయాలని.. పర్యావరణ పరిరక్షణ.. కాలుష్య నియంత్రణకు సంబంధించిన అత్యుత్తమ విధానాలకు సంబంధించి నెల రోజుల్లో సూచనలు చేయాలన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హేచరీ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఔషధ కంపెనీలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్న జగన్.. కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖ.. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాలువులను పూర్తిస్థాయిలో పరిరక్షించాలన్నారు. కోట్లాది రూపాయిల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఇష్టం వచ్చిన రీతిలో అనుమతులు ఇచ్చిన అంశాలపై బాబు సర్కారు ఏ పాయింట్లు మిస్ అయ్యిందో.. సరిగ్గా అవే అంశాలపై జగన్ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు.. ఏపీ ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News