వివేకా కేసులో కీలక ప్రముఖుల అరెస్టులకు సీబీఐ...?

Update: 2022-03-02 15:30 GMT
ఏపీలో రాజకీయ వేడి వేసవి వేడి కంటే ముందే పెరిగి మంట పెడుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ  హత్య విషయంలో బాగా లోతుల్లోకి వెళ్లి కూపీలు లాగుతున్న సీబీఐ తన దర్యాప్తుతో పెను  సంచలనాలనే నమోదు చేస్తోంది. మరో వైపు చూస్తే ఇప్పటికే పలువురి వాంగ్మూలాలు మీడియాలలో వెలుగు చూస్తున్నాయి. ఈ కేసు ఒక దశకు చేరుకుంది అని చెప్పకనే అవి చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా త్వరలో కొంతమంది కీలక నేతలను అరెస్ట్ చేయబోతున్నట్లుగా సీబీఐ అధికారులు కోర్టుకు తెలియచేయడం ఇపుడు సెన్సేషన్ అవుతోంది. వివేకా హత్య కేసులో అయిదవ నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా సీబీఐ చేసిన ఈ వ్యాఖ్యలు మీద పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది.

ఇక శంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ వాదించిన సీబీఐ ఇంకా పలువురు ప్రముఖ నేతల అరెస్టులు ఉంటాయని, ఇది కీలకమైన సమయం అని కూడా పేర్కొనడం అంటే నిజంగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త కాక రేగబోతోంది అనే అంటున్నారు. మరి సీబీఐ పేర్కొనే ఆ కీలక ప్రముఖులు ఎవరూ అన్నది కూడా చర్చగా ఉంది. అదే విధంగా సీబీఐ ఈ కేసు కీలక దశలో ఉంది అని చెప్పడాన్ని కూడా ఎవరికి తోచిన తీరున వారు విశ్లేషిస్తున్నారు.

ఏది ఎలాగున్నా కూడా సీబీఐ మాత్రం ఈ కేసు కీలక దశకు చేరుకుంది అంటే దాదాపుగా క్లైమాక్స్ అనే అనుకోవాలా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. ఈ నెల 15తో వివేకా హత్యకు గురి కాబడి మూడేళ్ళు పూర్తి అవుతాయి. మరి ఈ లోగానే ఈ కేసులో ప్రముఖులుగా భావిస్తున్న వారిని అరెస్ట్ చేసి సీబీఐ తన దూకుడుని చాటుకుంటుందా అన్న మాట కూడా ఉంది. మొత్తానికి రానున్న కొద్ది రోజుల్లో ఏదో జరగబోతోంది  అన్నది మాత్రం నిజం అంటున్నారు.
Tags:    

Similar News