ఆరో రోజున అదే ప‌ట్టుద‌ల‌.. సంక‌ల్పం

Update: 2018-04-11 06:22 GMT
దీక్ష చేయ‌టం అంటే.. పొద్దు పొద్దున్నే చోళా భ‌టూరీలు తిని.. ఏమీ తెలీన‌ట్లు మూతులు తుడుచుకొని దీక్షా శిబిరం దగ్గ‌ర కూర్చోవ‌టం కాదు. సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌..  అనుకున్న‌ది నెర‌వేరే వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గ‌కూడ‌ద‌న్న ప‌ట్టుద‌ల‌.. స‌వాళ్ల‌కు వెర‌వ‌ని త‌త్త్వం.. అన్నింటికి మించిన సంక‌ల్పం చాలా అవ‌స‌రం. ఇది నిండుగా క‌నిపిస్తోంది ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్లో.

ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌ట‌మే కాదు.. రాజీనామా లేఖ‌ల్ని స్పీక‌ర్ చేతికి వ‌చ్చేసి నేరుగా ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 74 ఏళ్ల వ‌య‌సులో ఒక‌రు.. 60 ప్ల‌స్ ఏజ్ లో మ‌రొక‌రు ఇలా వ‌యోభారాన్ని ప‌ట్టించుకోకుండా దీక్షా శిబిరంలో కూర్చున్నారు. అయితే.. వ‌య‌సు కార‌ణంగా వారి ఆరోగ్యం ఆందోళ‌క‌రంగా మార‌టంతో వైద్యుల బ‌ల‌వంతంతో దీక్ష చేస్తున్న కొంద‌రు నేత‌ల్ని పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇదిలా ఉంటే.. యువ ఎంపీలు మిథున్ రెడ్డి.. వైఎస్ అవినాష్ రెడ్డిలు మాత్రం ప‌ట్టుద‌ల‌తో దీక్ష చేస్తున్నారు. క‌నీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా ప‌ట్టుద‌ల‌తో దీక్ష‌ను ముందుకు తీసుకెళుతున్నారు. మొత్తం ఐదుగురుఎంపీల‌తో మొద‌లైన దీక్ష ప్ర‌స్తుతం ఇద్ద‌రు ఎంపీల‌తో ఆరో రోజున కూడా కొన‌సాగుతోంది. గ‌డిచిన ఆరు రోజులుగా ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లోనూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం మంచినీళ్లు సైతం తాగ‌కుండా చేస్తున్న దీక్ష కార‌ణంగా యువ ఎంపీలు ఇద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారింది. అయిన‌ప్ప‌టికీ త‌మ డిమాండ్ల‌పై కేంద్రం స్పందించే వ‌ర‌కూ వెన‌క్కి త‌గ్గ‌మ‌న్న మొండిప‌ట్టుద‌ల‌తో దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు.

మ‌రోవైపు.. ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం ప‌ట్టుద‌ల‌తో దీక్ష చేస్తున్న ఇద్ద‌రు ఎంపీల‌తో వైఎస్ జ‌గ‌న్ మాట్లాడారు. ఎంపీలు చేస్తున్న దీక్ష త‌మ‌కు స్ఫూర్తి అని.. వారి నిర‌స‌న‌కు రాష్ట్ర ప్ర‌జ‌లంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ట్లుగా జ‌గ‌న్ వెల్ల‌డించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురుఎంపీలు చేస్తున్న దీక్ష‌కు రాష్ట్రం గ‌ర్విస్తోంద‌న్న జ‌గ‌న్.. వారిని ప్ర‌జ‌లు క‌ల‌కాలం గుర్తుంచుకుంటార‌న్నారు.

ఆరు రోజులుగా ప‌ట్టువిడ‌వ‌కుండా చేస్తున్న దీక్ష కార‌ణంగా మిథున్‌.. అవినాష్ ల ఆరోగ్యం దెబ్బ తింది. వారిలో చ‌క్కెర స్థాయిలు బాగా ప‌డిపోయిన‌ట్లుగా వైద్యులు ప్ర‌క‌టించారు. నీర‌సం నిండుగా ఆవ‌హించిన‌ప్ప‌టికీ వారు మాత్రం ప‌ట్టు వీడ‌కుండా దీక్ష‌ను చేస్తున్నారు. వైద్య ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని.. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించాల‌ని వైద్యులు చెబుతున్నారు. తాజా ప‌రిణామాల‌తో దీక్షా స్థ‌లి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.
Tags:    

Similar News