హోదాకోసం ఇది చిత్తశుద్ధి కాదా?

Update: 2017-10-10 05:03 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేఅంశాన్ని తెలుగుదేశం పార్టీ తమ స్వప్రయోజనాలకోసం ఎప్పుడో తుంగలో తొక్కేసింది. రాష్ట్రంలో యువత  ప్రధానంగా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందాలంటే, సత్వరం రాష్ట్రం ప్రగతి బాటలోకి అడుగుపెట్టాలంటే.. ప్రత్యేక హోదా ఒక్కటే శరణ్యం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి మడమతిప్పని పోరాటం సాగిస్తోంది. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ప్రారంభించిన తర్వాత పవన్ కల్యాణ్ కూడా హోదా గురించి గట్టిగానే మాట్లాడారు. ఆ తర్వాత నెమ్మదిగా హోదా అంశాన్ని పక్కన పెట్టేసి ఇతర సమస్యలను మాత్రం ప్రస్తావిస్తున్నారు. అయితే తాజాగా ఆ పార్టీ ప్రతినిధులు హోదా పోరాటం గురించి ప్రశ్నించినప్పుడు వైసీపీతో కలిసి అయినా హోదాకోసం పోరాడడానికి తాము సిద్ధమే అని ప్రకటించారు.

అయితే జగన్మోహనరెడ్డి కూడా హోదా పోరాటాన్ని పక్కన పెట్టేశారనే దుష్ర్పచారం కూడా ఇటీవలి కాలంలో పచ్చ మీడియాలో వెల్లువలా సాగుతోంది. దానికి జవాబే అన్నట్లుగా జగన్మోహనరెడ్డి ఇవాళ అనంతపురంలో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా కావాల్సిన ఆవశ్యకత మీదనే ప్రధానంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. కేవలం జగన్మోహనరెడ్డి మాత్రమే కాదు.. అనంతపురం, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్లు, న్యాయవాదులు, మేధావులు అనేక మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి యువతకు అవగాహన కల్పించనున్నారు. హోదా కోసం పోరాడాల్సిన ఆవశ్యకత గురించి వారికి చెప్పనున్నారు. మరి ఇదంతా ఏమిటి? వైసీపీలో గానీ, జగన్మోహన  రెడ్డిలో గానీ.. ప్రత్యేక హోదా సాధించడం గురించిన చిత్తశుద్ధి కాదా?

కేంద్రంనుంచి హోదాను రాబట్టుకోవడంలో.. తామంటూ ముందంజలో ఉంటూ.. నాయకత్వ పాత్ర పోషిస్తూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీలను నడిపించి సాధించాల్సిన బాద్యత సాధారణంగా పాలకపక్షానికి ఉంటుంది. ప్రత్యేక హోదా అంటూ దక్కితే గనుక.. జరగబోయే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మొత్తం పాలకుల ఖాతాలోకి వెళుతుంది గనుక వారు దీనికోసం ఆత్రుత పడాలి. అయితే మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మొత్తం రాష్ట్ర ప్రయోజనాల్ని తమ సొంత వక్ర ప్రయోజనాలకోసం తాకట్టు పెట్టేసిన చంద్రబాబు సర్కారు... సైంధవపాత్రను పోషిస్తోంది. దానికి తోడు.. పోరాడుతున్న విపక్షం స్ఫూర్తిని కూడా మంటగలపడానికి తన వంతుగా అడ్డంకులు సృష్టిస్తూ.. లేకి విమర్శలు చేస్తూ సాగుతోంది. అయితే హోదాకోసం ఎవరు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారో, తమ వంతు పోరాటం చేస్తున్నారో.. ఎవరు దానిని నీరు గారుస్తున్నారో మొత్తం ప్రజలు గమనిస్తుంటారని, ఇది పాలకులకు హెచ్చరికేనని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News