వైఎస్ఆర్ జయంతి నిర్వహించడానికి ‘వసూళ్లా?’.. ఏందీ ఈ కథ చూద్దాం

Update: 2021-07-07 08:42 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి వైసీపీ నేతలకు ఆర్థిక భారాన్ని మోపుతోందట.. పైసా విదిల్చని వైసీపీ అధిష్టానం.. జయంతిని మాత్రం పండుగలా చేయాలని ఆదేశించడాన్ని నేతలు తట్టుకోలేకపోతున్నారట.. ఇప్పుడీ వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది.

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ.. పార్టీ అధినేత దేవుడుగా కొలిచే పెద్దాయన జయంతి. స్వయంగా ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ఆర్ ను స్మరించుకునే రోజు. అసలు వైసీపీ పుట్టుకకే కారణమైన వ్యక్తి పుట్టినరోజు అంటే వైసీపీకి పండుగే. రాష్ట్రమంత పండుగ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అంతా బాగానే ఉంది. ఈ పండుగ చేయడానికి పైసలెట్లా? డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.

ఆర్భాటంగా పండుగ చేయడం కాదు.. ఆ పండుగకు కావాల్సిన నిధులు, విధులు ఇవ్వడం మరిచిపోయిందట వైసీపీసర్కార్. దీంతో వైఎస్ఆర్ జయంతి పండుగ భారం ఇప్పుడు కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలపై పడిందట.. ఇప్పుడు కొందరు పదవుల ఆశకు ఖర్చు చేస్తుంటే.. కాబోయే విస్తరణలో మంత్రి పదవులు వస్తాయని మరొకొందరు ఎమ్మెల్యేలు చచ్చీ చెడీ ఈ ఖర్చు భరిస్తున్నారట.. పార్టీ కార్యక్రమానికి మేం అప్పులు చేసి పండుగ చేయడం ఏంటని కొందరు క్షేత్రస్థాయి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారట.. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలన్న అధిష్టానం.. ఎవరికి రూపాయి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు.. మరో దారి లేక వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు సిద్ధమవుతున్నారట.. ఇప్పటికే చాలా మందికి టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ వ్యవహారం ప్రతిపక్ష టీడీపీ నేతలకు కొందరు ఉప్పందించడంతో వారు సోషల్ మీడియాలో వైసీపీ పరువు తీస్తున్నారు. వైఎస్ఆర్ జయంతికి ఖర్చు చేయడానికి డబ్బులు ల్లేవా? ఇవ్వరా అంటూ వైసీపీ అధిష్టానంను ఏకిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వసూళ్లు చేసి పండుగ చేస్తే కార్యక్రమాలు నడుస్తాయా? ఇలా అయితే వైఎస్ఆర్ ఆత్మ శాంతించడం మాట అటు ఉంచితే మా డబ్బులు ఖర్చు అయ్యి ఆత్మ ఘోషిస్తుందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ జయంతి సందర్భంగా కొందరు మంత్రులు స్వయంగా ఎమ్మెల్యేలకు టార్గెట్లు విధించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఈ మంచి తరుణం మించిన దొరకదు అని ఎగబడిపోయి ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ జయంతిని నిర్వహిస్తూ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేపనిలో బిజీగా ఉన్నారట..

ఇక కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఖర్చులు పెరిగిపోయి తమ నియోజకవర్గంలోని బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అధికారుల నుంచి కూడా వసూళ్లు చేస్తున్నారని.. వైఎస్ఆర్ జయంతి కాస్తా వైసీపీ పరువు తీసే కార్యక్రమంగా మారిపోయిందన్న గుసగుసలు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.

ఇప్పుడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సాగుతున్న వసూళ్ల వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి పరువు తీసేలా ఉందని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని పలువురు వాపోతున్న పరిస్థితి నెలకొంది.

 అధికారంలో ఉన్న పార్టీలకు సాధారణంా నిధుల వరద ఉంటుంది. పనులు, ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా బాగానే గిట్టుబాటు అవుతుందంటారు. ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఆయా పార్టీలు పార్టీ పండుగలను ఘనంగా నిర్వహిస్తాయి. అయితే ఏపీలో మాత్రం ఇలా పార్టీ పండుగ కోసం అగచాట్లు పడడం.. నాయకులపై భారం మోపడం చర్చనీయాంశమవుతోంది. ఆ నేతలు రగిలిపోతూ మోహమాటానికి ఈ కార్యక్రమాలు చేస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News