వైఎస్సార్సీపీలో కార్యకర్తలు జెండా స్తంభాలేనా!

Update: 2019-07-12 16:21 GMT
'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారు ఇంట్లోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారు ఎమ్మెల్యేల చుట్టూ ఉన్నారు. కార్యకర్త ఎప్పుడూ జెండా స్తంభమే..' అంటూ తీవ్రంగా వాపోతూ ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ఈ మేరకు సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానుల వాల్స్ మీద ఒక పోస్ట్ కామన్ గా కనిపిస్తూ ఉంది. వారంతా గత పదేళ్లలో జగన్ కోసం తీవ్రంగా పని చేసిన వారే. అటు ఆన్ లైన్ లోనూ - ఆఫ్ లైన్ లోనూ వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సే శ్వాసగా - ధ్యాసగా తీసుకుని పని చేశారు. ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు. ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వారు గత పదేళ్లలో తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.

మొదట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ జెండా దించి - జగన్  జెండా కట్టినందుకు గానూ అప్పుడు ఎమ్మెల్యేల నుంచి - అధికారంలో ఉన్న వారి నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో చాలా మంది నేతలు కాంగ్రెస్ లో ఉండే వారు. కార్యకర్తలు - క్యాడర్ మాత్రం అప్పటికే జగన్ కు జై కొట్టారు.  దీంతో సదరు నేతలు వారిని వేధించసాగారు.

తీరా ఎన్నికల సమయానికి ఆ నేతలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారేమో అధికారాన్ని సాంతం అనుభవించి జగన్ కు జై కొట్టారు. అయితే అప్పటికే జగన్ పై వీరాభిమానంతో ఉత్సాహంగా పని చేసిన వాళ్లు మాత్రం అటు కాంగ్రెస్ నుంచి - మరోవైపు తెలుగుదేశం నుంచి ఇబ్బందులు పడ్డారు.

తొలి నాలుగున్నారేళ్లూ అలా జగన్ మోహన్ రెడ్డికి జై కొట్టిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకోలేకపోయింది. దీంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి.

జగన్  పేరెత్తిన వారిపై గత ఐదేళ్లలో తీవ్రమైన కక్ష సాధింపు చర్యలకు దిగింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు అంటూ.. తమ పార్టీ కార్యకర్తల చేతికి పవర్ అందించింది. వాళ్లేమో దాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు ఉపయోగించారు. ఆ కక్ష రాజకీయాలతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతలాకుతలం అయ్యాయి. అయినా వారు ‘జై జగన్’ అనే మాటను మాత్రం విడవలేదు.

ఎన్నో ఇబ్బందులకు ఓర్చి పార్టీ కోసం పని చేశారు. తాము ఓటు వేయడమే కాకుండా.. అనేక రకాలుగా తటస్థులను కూడా ప్రభావితం చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడేలా చూశారు. జగన్ వస్తే కలిగే ప్రయోజనాల గురించి తటస్థులకు కూలంకషంగా వివరించి చెప్పారు.

బూత్ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఉన్నబలం ఏమిటో తెలిసిందే. పోల్ మేనేజ్ మెంట్లో చంద్రబాబు నాయుడు పండితుడు అంటారు. అలాంటి శక్తులను తుత్తినియలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పని చేసింది. ఇటీవలి ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డూ ఆర్ డై అన్నట్టుగా భావించి పార్టీ కోసం తీవ్రంగా కష్టపడ్డారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రతో - ఇతర వ్యూహాలతో ఎంతగా కష్టపడ్డారో… క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కూడా ఆ కష్టం నుంచి స్పూర్తి  పొంది పోరాడారు. పనులు వదులుకుని పార్టీ కోసం పని చేసిన వారు కొందరైతే - పార్టీ కోసం పని చేయడమే తమ పని అనుకున్న వారు మరి కొందరు. అలాంటి కార్యకర్తల శ్రమతోనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వారంతా పని చేశారని చెప్పలేం. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వారు సగర్వంగా తలెత్తుకోవడం మాత్రం జరగాల్సిన పని. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానా లో ఆ పార్టీ శ్రేణులే అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకుంటున్న ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఏదో కొద్ది మంది నేతలు మాత్రమే ఇప్పటి వరకూ నియోజకవర్గాల కేంద్రాలకు వెళ్లి - ఊర్లలో తిరుగుతున్నారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వారు మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గాలకు మొహం చాటేశారు. తమకేదో పని ఉన్నట్టుగా - నియోజకవర్గంలో పర్యటించేంత తీరిక లేనట్టుగా సదరు నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. తమ కోసం పని చేసిన వారి గురించి ఇప్పుడు పట్టించుకునే ఓపికను కొందరు ఎమ్మెల్యేలు చూపకపోవడం గమనార్హం.

ఇక మరి కొన్ని చోట్ల అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద కొత్త వాళ్లు తయారయ్యారు. ఎన్నికల ముందు వరకూ పార్టీ కోసం ఎంతగానో పని చేసిన వారి స్థానంలో కొత్త వాళ్లు కార్యకర్తలు అయిపోయారు! నిన్నమొన్నటివరకూ వారు ఎవరో - ఎక్కడ ఉండే వారో కూడా తెలియదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడిన వారిని అడ్రస్ లేకుండా చేసి కొత్త వాళ్లు రాజ్యం చలాయిస్తున్నారు. పార్టీ వస్తే ఏదో ప్రతిఫలం దక్కడం సంగతలా ఉంటే - ఇన్నాళ్లూ తాము పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు ఎవరెవరో ఆ క్రెడిట్ ను క్లైమ్ చేసుకుని - ఎమ్మెల్యేల వద్ద - ముఖ్య నేతల వద్ద ఊరూపేరు ఎరగని వాళ్లు హంగామా చేస్తూ ఉంటే.. నిఖార్సైన కార్యకర్తలది ఆవేదనే అవుతూ ఉంది.

కష్టపడింది తామైతే - ఇప్పుడు కాలర్ ఎగరేస్తోంది మరెవరో! ఈ పరిస్థితి ఒక్క కార్యకర్తది కాదు.. అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు - నేతలు ఎంత త్వరగా గ్రహిస్తే ఆ పార్టీకే అంత మేలు. అలా కాదంటే.. మొదటికే మోసం రాగలదు. ఈ విషయంలో అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిందించడానికి ఏమీ లేదు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలే ఈ విషయాలపై అత్యంత శ్రద్ధ వహించాలి!


Tags:    

Similar News