అవంతి సంచ‌ల‌నం!..గంటా టార్గెట్ సీఎం కుర్చీ!

Update: 2019-02-16 16:40 GMT
ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు అలియాస్ అవంతి శ్రీ‌నివాస్‌... పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. మొన్న‌టిదాకా టీడీపీలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా విశాఖ జిల్లా అన‌కాప‌ల్లి ఎంపీగా అవంతి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. విద్యా సంస్థ‌ల అధినేత‌గా ఉన్న అవంతి.... రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాల‌మే అయినా మ‌చ్చ లేని నేత‌గానే పేరు తెచ్చుకున్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అనుచ‌రుడిగా, ఆయ‌న వెన్నంటే న‌డిచిన నేత‌గా అవంతికి పేరున్నా... ఏనాడూ గంటాపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల ద్వారా త‌న‌కు మ‌కిలీ అంటించుకోకుండా చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హారం న‌డుపుకుంటూ వ‌చ్చారు. ఇటీవ‌లే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హార స‌ర‌ళితో మ‌న‌స్తాపం చెందిన అవంతి టీడీపీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా ద‌క్కిన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.

అప్ప‌టిదాకా అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చిన అవంతి... వైసీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత మాత్రం వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు. మీడియా ముందుకు వచ్చిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబుతో పాటు మంత్రి గంటాపై త‌న‌దైన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న అవంతి... తాజాగా వారిద్ద‌రిపై మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు తాను అన‌కాప‌ల్లి ఎంపీ సీటునే అడ‌గ‌లేద‌ని, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం భీమిలి అసెంబ్లీ నుంచి తాను పోటీసి సిద్ధంగా ఉంటే... చంద్ర‌బాబే త‌న‌కు ఎంపీ టికెట్ ఇచ్చార‌ని ఆయ‌న చెప్పారు. తాను భీమిలి అడిగితే... అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఎందుకిచ్చారో ఇప్పుడు చెప్పాలంటూ అవంతి సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు నిజంగానే వైర‌ల్‌గా మారాయి. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న గంటాపై నిప్పులు చెరుగుతూ... బాబు వైఖరిని చెడుగుడు ఆడుకున్నారు. మంత్రి గంటాపై త‌న‌దైన శైలిలో ఘాటు వ్యాఖ్య‌లు చేసిన అవంతి... గంటాను మించిన మోస‌గాడు మ‌రొక‌రు ఉండ‌రంటూ సంచ‌ల‌నం రేపారు.

అయినా గంటా ల‌క్ష్యం భీమిలి ఎమ్మెల్యే టికెట్టో - మంత్రి ప‌ద‌వో కాద‌ని పేర్కొన్న అవంతి... ఏకంగా సీఎం సీటుకే గంటా ఎస‌రుపెట్టార‌ని ఆరోపించారు. అయినా గంటా వ్య‌క్తిత్వం ఏమిటో తాను చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న అవంతి... టీడీపీ సీనియ‌ర్ నేత‌, బాబు కేబినెట్ లోని మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడిని అడిగితే స‌రిపోతుంద‌ని కూడా సెటైర్లు సంధించారు. గంటాపై సిట్ కేసు న‌మోదు చేసిందంటే ప‌రిస్థితి ఏమిటో అర్థ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. చంద్రబాబు తనకు రోల్‌ మోడల్ అని చెప్పుకునే గంటా మాటలు ముమ్మాటికీ వాస్తవమేనని అవంతి మ‌రో సెటైర్ వేశారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబే గంటాకు ఆదర్శమన్నారు. త‌న‌ను నమ్మి టీడీపీలోకి వెళ్లినవారిలో చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబుకు టికెట్‌ లేకుండా చేసిన ఘ‌న‌త గంటాదేన‌న్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని అనుకుంటే పొరపాటేనని ఆయ‌న వ్యాఖ్యానించారు.

జిల్లా మంత్రిగా ఉన్న గంటా ఒక్కరోజు కూడా సమన్వయకమిటీ సమావేశాలకు హాజరు కాలేదని, అలాంటిది తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని చెప్పిన అవంతి... గంటా తన జోలికి రాకుండా ఉంటేనే మంచిద‌ని ఓ హెచ్చ‌రిక జారీ చేశారు. తనకు రెండు లక్షలమంది విద్యార్థుల శక్తి ఉందని చెప్పిన అవంతి... త‌న జోలికి వ‌స్తే తాను చాలా విష‌యాలు బ‌య‌ట పెట్టాల్సి వ‌స్తుంద‌ని తీవ్ర‌ హెచ్చ‌రించారు. ఇక ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న ఎత్తుకున్న అవంతి... విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మించి మోసం చేయడం బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య అని ధ్వ‌జ‌మెత్తారు. మొత్తంగా అవంతి... అటు గంటాతో పాటు ఇటు చంద్ర‌బాబును కూడా ఓ ఆట ఆడేసుకున్నార‌ని చెప్పాలి.
Tags:    

Similar News