తెలుగు రాష్ర్టాల్లో ఓటుకు నోటు హీటు తారాస్థాయికి చేరింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరిగిన ఈ ఘట్టంపై విపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తాజా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసును తిరిగి తెరవాలని సూచించిన నేపథ్యంలో వైఎస్ ఆర్ సీపీ స్పందించింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ. 50 లక్షలు ఇస్తూ ఆడియో టేపుల్లో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అని అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తూ దొరికిపోయిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు కానీ.. సూత్రధారి అయిన చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు.ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఆడియో టేపులోని వాయిస్ చంద్రబాబుదేనని ఏసీబీ చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో చేయించిన పరీక్షల్లో తేటతెల్లమైంది. చట్టం - రాజ్యాంగంపై తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ఉంటే కేసును చట్టప్రకారం విచారణ జరిపించాలని కోరారు. ఓటుకు కోట్ల కేసుపై తెలంగాణ ప్రభుత్వం నిస్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు తన స్వార్థానికి ఉపయోగించుకున్న ఓటుకు కోట్ల కేసు ఏపీ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజాస్వామ్యం సిగ్గుపడే పని చేసిన చంద్రబాబు తెలంగాణ సర్కార్ తో లాలూచీ పడి రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టారని విరుచుకుపడ్డారు. పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను - ఏపీ హక్కులను తెలంగాణకు కట్టబెట్టారని మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో కూడా మోసం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నదులపై ప్రాజెక్టులు కడుతుంటే దాన్ని అడ్డుకోకుండా చంద్రబాబు చీకటి ఒప్పందాల రీత్యా మౌనంగా ఉన్నారని వైసీపీ నేత బొత్స ఆరోపించారు. చంద్రబాబులా కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తిలా ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చే రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించాలని వైఎస్‌ఆర్ సీపీ కోరుతుందన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేలా చేయొద్దని కోరారు.
చంద్రబాబుకు రాజ్యాంగం అన్నా.. చట్టాలు అన్నా చిత్తశుద్ధి లేదని, రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రలుగా చేశారని బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని నిర్మించి చట్టాలన్ని ఏ విధంగా అమలు చేసుకోవాలనే దిక్సూచి ఇచ్చిన మహానుభావుడికి అందరూ గౌరవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని విరుచుకుపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మూడు సంవత్సరాలైనా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శాకమూరులో అంబేద్కర్ స్మృతివనం కోసం 15 ఎకరాలు కేటాయిస్తూ ఒకసారి రూ. వంద కోట్లతో జీఓ - ఇంకోసారి రూ. 90 కోట్లతో జీఓ విడుదల చేశారన్నారు. అయినా ఇప్పటి వరకు టెండర్లు కూడా పిలవలేదంటూ చంద్రబాబుకు దళితులపై ప్రేమ - అంబేద్కర్ పై గౌరవం ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున - నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మౌనదీక్ష చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్ కు తగిన గౌరవం ఇవ్వాలని ప్రతిపక్షం శాంతిదీక్ష చేస్తుంటే.. చంద్రబాబు పోలీసులతో అణగదొక్కించడం హేయనీయమన్నారు.