మళ్లీ ఆగ్లీ సీన్స్‌ను చూపించిన జగన్‌బ్యాచ్‌

Update: 2015-03-20 04:59 GMT
ఈసారి సభలో నేను కోరినంత సమయం ఇవ్వకపోతే అగ్లీసీన్స్‌ చూపిస్తానని బీఏసీ సమావేశంలోనే వార్నింగ్‌ ఇచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.. అందుకు తగ్గట్లే తన పరివారాన్ని నడిపించారన్న భావన వ్యక్తమవుతోంది.

అధికారపక్షం ఒకవేళ దుందుడుగా వ్యవహరిస్తే.. అది వారికే ప్రతికూలంగా మారి.. ప్రజల్లో వ్యతిరేకత రావటం ఖాయం. విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ఓంటెద్దుపోకడలకు పోతే.. దాని వల్ల నష్టపోయేది అధికారపక్షమే తప్ప విపక్షం కాదు. ఎందుకంటే.. ఎవరేం మాట్లాడారో నిత్యం అసెంబ్లీ సమావేశాలు చూసే ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది.

కాకపోతే.. అధికారపక్షం తమ గొంతు నొక్కేస్తుందంటూ విపక్షం అగ్లీగా వ్యవహరించటం ఏమాత్రం సమంజసం కాదు. ఇచ్చిన సమయం అయిపోయిందని స్పీకర్‌ విపక్ష నేతకు మరి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు.. స్పీకర్‌ తీరుపైనా.. అధికారపక్షంపైనా నిరసన వ్యక్తం చేస్తూ హుందాగా వాకౌట్‌ చేయొచ్చు. లేదంటే అసెంబ్లీలో స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి మౌనంగా చెవులు.. కళ్లు.. నోరు మూసుకొని నిరసన చేసి తమ ఆవేదనన ప్రజలకు తెలిపే ప్రయత్నంచేయొచ్చు.

అదేమీ లేకుండా స్పీకర్‌ బల్లను పిడిగుద్దులు గుద్దటం.. అసెంబ్లీ సమావేశాల్ని కవర్‌ చేసే కెమేరామెన్లకు వార్నింగ్‌ ఇస్తూ.. కెమేరాలు పగిలిపోతాయంటూ వీరంగం ఆడటం ఎలా సమర్థించుకుంటారు.

తమను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారు(మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం) అంటూ విపక్ష నేత జగన్‌ చెబుతూ.. ఆ బాధతో స్పీకర్‌ బల్లను కాస్త గట్టిగా చరిస్తే (పిడి గుద్దులు గుద్దుతూ.. బూతులు తిడుతుంటే) అది కూడా తప్పేనా అంటూ చాలా అమయాకంగా ప్రశ్నించారు. ఉదయం నుంచి అసెంబ్లీ సమావేశాలు చూడకుండా.. గురువారం మధ్యాహ్నం జగన్‌ ప్రెస్‌మీట్‌ను చూస్తే.. అరేరె.. జగన్‌బాబుకు ఎంత కష్టం అనిపించక మానదు. అంత చక్కగా ఆయన తమ పరివారం చేసిన పనుల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

స్పీకర్‌ను ఫ్యాక్షనిస్ట్‌ అని..రౌడీ స్పీకర్‌ అంటూ.. స్పీకర్‌ డౌన డౌన్‌ అని నినదించటమే కాదు.. అధికారపక్ష సభ్యుల్ని బూతులు తిట్టేయటం గౌరవ విపక్షానికి ఎంతవరకు సబబు అన్నది వారికే తెలియాలి. సస్పెండ్‌ అయిన సభ్యుడ్ని సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పుడు హుందాగా వెళ్లిపోవాలి. అంతేకానీ.. దొంగా పోలీస్‌ ఆట మాదిరి.. సస్పెండ్‌ అయిన సభ్యులు వ్యవహరిస్తే.. వారిని గుర్తించి బయటకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బందికి పావు గంటకు పైనే సమయం పట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ఎవరి దాకో ఎందుకు? సస్పెండ్‌ అయిన శివప్రసాద్‌రెడ్డి జగన్‌ పక్కనే ఉన్నారు. ఆయన్ని గుర్తించిన మార్షల్స్‌.. ఆయన్ను బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు.. అందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రోజా.. జ్యోతుల నెహ్రూ.. మరికొందరు అడ్డుకున్న తీరు.. ఎంత ప్రయాసతో శివప్రసాద్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లాలో చూసినప్పుడు.. విపక్ష సభ్యులు ఇంత సీన్‌ చేయాలా అనిపించకమానదు. సభలో అగ్లీ సీన్స్‌ చూస్తారన్న అధినేత మాటను అక్షరం పొల్లు పోకుండా చేసి చూపించటంలో జగన్‌ బ్యాచ్‌ వందశాతం విజయవంతం అయ్యారు.
Tags:    

Similar News