సొంత నియోజకవర్గంలో అసమ్మతితో వైసీపీ మంత్రి సతమతం!

Update: 2022-11-28 08:51 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. అయితే ఆయన ఆశ నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ వైసీపీ నుంచే ఎమ్మెల్యేలకు అసమ్మతి ఎదురవుతుండటం గమనార్హం. వీరిలో ఏకంగా మంత్రులకు కూడా అసమ్మతి సెగ తప్పకపోవడం గమనార్హం.

నగరిలో రోజాకు, నెల్లూరు సిటీలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు తీవ్ర అసమ్మతి బెడద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కోవలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా చేరారు.

ఎంసెట్‌ ఎంట్రెన్స్‌లో స్టేట్‌ టాపర్‌గా నిలిచి.. ఎంబీబీఎస్‌ కూడా పూర్తి చేసి మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీదిరి అప్పలరాజు. యువకుడు, విద్యావంతుడు కావడంతో గత ఎన్నికల్లో వైసీపీ సీటు దక్కించుకున్నారు. సామాజిక  సమీకరణాలు కలసి వచ్చి ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆ తర్వాత మంత్రిగానూ చిన్న వయసులోనే చాన్సు కొట్టేశారు.

అయితే మంత్రి అయినదగ్గర నుంచి ఆయన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పెద్ద ఎత్తున అవినీతికి మంత్రి పాల్పడుతున్నారని సొంత పార్టీ వైసీపీ నేతలే విమర్శిస్తుండటం గమనార్హం.

సీదిరి అప్పలరాజుకు సీటు ఇస్తే వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని అసమ్మతి నేతలు ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ హెచ్చరించారు.

ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. మంత్రి పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని పలాస వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో మంత్రి అప్పలరాజుకు తిరిగి టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని అంటున్నారు.

 2019 ఎన్నికల్లో అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీష పైన గెలుపొందారు. జగన్‌ తొలి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపారు. దీంతో అదే మత్స్యకార సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు సీఎం జగన్‌ తన కేబినెట్‌లో అవకాశం కల్పించారు. రెండో విడత జగన్‌ మంత్రి వర్గ విస్తరణలో పలువురికి ఉద్వాసన పలికినా అప్పలరాజును మాత్రం జగన్‌ కొనసాగించారు.

అప్పలరాజు కూడా ముఖ్యమంత్రి జగన్‌కు గట్టి మద్దతుదారుగా నిలబడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖకు గతంలో జగన్‌ వచ్చినప్పుడు ఒక సీఐని చొక్కా ఊడదీసి కొడతానంటూ అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.

ఈ నేపథ్యంలో అసమ్మతి నేతలు వన భోజనాల పేరిట సమావేశమయ్యారు. అప్పలరాజు వ్యవహారశైలితో వారంతా ధ్వజమెత్తినట్టు సమాచారం. గత ఎన్నికల్లో అప్పలరాజుకు గెలుపుకు కృషి చేస్తే అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డట్టు తెలుస్తోంది. పలాస-కాశీబుగ్గకు చెందిన నేతలు అప్పలరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అప్పలరాజుకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని.. ఇస్తే ఈ సీటుపై ఆశలు వదిలేసుకోవాలని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News