చించేస్తాన‌ని ఢిల్లీకి వ‌చ్చి ఏం చేశారు బాబు?

Update: 2018-04-06 10:00 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఉద్దేశించి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. త‌మ పార్టీ ఎంపీలు పార్ల‌మెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టార‌ని.. టీడీపీ ఎంపీలు పార్ల‌మెంటులో ఏం పీకుతున్నారంటూ ఫైర్ అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. హోదా సాధ‌న విష‌యంలో త‌మ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూర్తి క్లారిటీతో ఉన్నార‌న్నారు.

తాము మొద‌టి నుంచి చెప్పిన‌ట్లే హోదా కోసం పోరాడుతున్నామ‌ని.. ఇందులో భాగంగా 12 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని లోక్ స‌భ‌లో స్పీక‌ర్ కు అంద‌జేసిన‌ట్లుగా గుర్తు చేశారు. స‌భ‌కు అన్నాడీఎంకే ఎంపీలు అడ్డు త‌గులుతున్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రితో క‌నీసం ఫోన్లో కూడా మాట్లాడ‌లేద‌ని గుర్తు చేశారు.

 త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రితో మాట్లాడి ఒక రోజు అయినా త‌మ అవిశ్వాసంపైన చ‌ర్చ జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌ని కోర‌ని దిక్కుమాలిన సీఎం చంద్ర‌బాబు అని ధ్వ‌జ‌మెత్తారు. బాబు కానీ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రితో మాట్లాడి ఉంటే క‌నీసం సానుకూల స్పంద‌న అయినా వ‌చ్చి ఉండేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ప‌క్క రాష్ట్రం ముఖ్య‌మంత్రితో కూడా మాట్లాడ‌లేని చంద్ర‌బాబు.. ఢిల్లీకి వ‌చ్చి ఏం పీకుదామ‌నుకున్నారంటూ తీవ్రస్థాయిలో ప్ర‌శ్నించారు.

ఢిల్లీకి వ‌చ్చి ఏదో చించేస్తాన‌ని.. కేంద్రానికి ద‌డ‌పుట్టిస్తాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. చివ‌ర‌కు పార్ల‌మెంటు వ‌ద్ద ఆంధ్రుల గౌర‌వాన్ని త‌గ్గించేలా చేశార‌న్నారు. ఫోటోల‌కు ఫోజుల కోసం పార్ల‌మెంటు మెట్ల ద‌గ్గ‌ర వంగ‌టం సిగ్గు చేటుగా అభివ‌ర్ణించారు. హేమాహేమీల‌ను క‌లుస్తాని చెప్పిన చంద్ర‌బాబుకు చివ‌ర‌కు.. బాలీవుడ్ న‌టి క‌మ్ ఎంపీ హేమ‌మాలిని క‌లిశారంటూ ఎద్దేవా చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే టీడీపీకి ప‌డుతుంద‌న్న ఆయ‌న‌.. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా.. ల‌డ్డూలు.. శాలువాలు క‌ప్పి రావ‌ట‌మే కానీ హోదా గురించి మాట్లాడ‌లేద‌న్నారు. ఇప్పుడేమో హోదా కోసం తాను మాత్ర‌మే పోరాడుతున్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇస్తున్నారంటూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

చంద్ర‌బాబును ఏపీ ప్ర‌జ‌లు మ‌హ్మ‌ద్ గ‌జినీలా చూస్తున్నార‌ని.. ఆయ‌నేం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలీద‌న్నారు. ఇప్ప‌టికైనా దిక్కుమాలిన డ్రామాల‌ను క‌ట్టిపెట్టి.. ప్ర‌త్యేక హోదా కోసం బాబు చిత్త‌శుద్ధితో పోరాడాల‌న్నారు. తెలుగుదేశం పార్టీ చేప‌ట్టిన సైకిల్ యాత్ర‌లు ఉత్త డ్రామా అంటూ కొట్టిపారేస్తూ.. త‌మ ఎంపీల రాజీనామాల్ని ఆమోదింప‌చేసుకొని ఉప ఎన్నిక‌లకు వెళ్లి మ‌ళ్లీ గెలిపించుకుంటామ‌న్నారు. బాబు తీరును తీవ్ర‌స్థాయిలో ఏకిపారేస్తున్న జ‌గ‌న్ పార్టీనేత‌ల తీరుకు టీడీపీ నేత‌లు అందుకు ధీటుగా రిటార్ట్ ఇవ్వ‌లేక‌పోతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News