జ‌గ‌న్ దెబ్బ‌కు బాబుకు వ‌ణుకు త‌ప్ప‌దా?

Update: 2017-08-01 08:51 GMT
నిజ‌మే... ఏపీలో అధికార పార్టీ టీడీపీ ముంద‌రి కాళ్ల‌కు బంధ‌నాలు ప‌డిపోతున్నాయి. అప్పుడెప్పుడో ఏడాది క్రితం జ‌న చైత‌న్య యాత్ర‌ల పేరిట గ్రామాల బాట ప‌ట్టిన టీడీపీ... రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటి త‌లుపు త‌ట్టాల‌ని త‌ల‌చింది. అయితే... నాడు ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇచ్చే స‌మ‌స్యే లేదంటూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేయ‌డంతో రాష్ట్రంలో రేగిన అల‌జ‌డికి టీడీపీ జ‌న‌చైత‌న్య యాత్ర‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోక త‌ప్ప‌లేదు. అంతేనా... టీడీపీ అధిష్ఠానం ప్ర‌త్యేకించి ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నిర్దేశించుకున్న పార్టీ స‌భ్య‌త్వానికి కూడా భారీగా గండిప‌డిపోయింది. నాడు టీడీపీ ముంద‌రి కాళ్ల‌కు బంద‌నాలు ప‌డిపోవ‌డానికి కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు కార‌ణం కాగా... ఇప్పుడు ప్రారంభం కాక‌ముందే ఆ పార్టీ ముంద‌రి కాళ్లకు బంధ‌నాలు ప‌డిపోవ‌డానికి కార‌ణం మాత్రం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న కీల‌క నిర్ణ‌య‌మ‌నే చెప్పాలి.

ఆ సంగ‌తేంటో ఓ సారి ప‌రిశీలిస్తే... నిన్న పార్టీ నియోజవ‌ర్గ క‌న్వీన‌ర్ల‌తో హైద‌రాబాదులో జ‌రిగిన ప్ర‌త్యేక భేటీలో జ‌గ‌న్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అభిమానులుగా, వైఎస్ జ‌గ‌న్ అభిమానులుగా, వైసీపీ అభిమానులుగా ఉన్న వారి కుటుంబాల‌కు ప్ర‌త్యేకంగా స్టిక్క‌ర్లు అంటిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఇదేదో బ‌ల‌వంతంగా చేస్తున్న ప్ర‌క్రియ కాద‌ని, ఆయా కుటుంబాలు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తేనే పార్టీ స‌భ్య‌త్వం ఇస్తామ‌ని, అదే స‌మ‌యంలో ఆ ఇంటికి వైసీపీ స్టిక్క‌ర్ వేస్తామ‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. సెప్టెంబ‌ర్ 11 నుంచి అక్టోబ‌రు 2 దాకా *వైఎస్ ఆర్ కుటుంబం* పేరిట‌ నాన్ స్టాప్‌ గా జ‌రిగే ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ ముఖ్య నేత‌లంతా పాలుపంచుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికి వెళ్లే వైసీపీ శ్రేణులు... ఆయా కుటుంబాల‌కు ఓ సెల్ నెంబ‌రును ఇస్తాయి. దానిని తీసుకునే కుటుంబాలు... వారికి న‌చ్చితే... స‌ద‌రు నెంబ‌రుకు మిస్డ్ కాల్ ఇస్తే స‌రిపోతుంది.

సింగిల్ మిస్ట్ కాల్ తో వారి ఫోన్ కు అవ‌తలి వైపు నుంచి కాల్ రావ‌డ‌మే కాకుండా జ‌గ‌న్ సందేశం కూడా వినిపిస్తుంది. ఆ త‌ర్వాత స‌ద‌రు కుటుంబం వివ‌రాలు సేక‌రించే వైసీపీ శ్రేణులు ఆ కుటుంబానికి పార్టీ స‌భ్య‌త్వం ఇస్తారు. ఆ వెంట‌నే స‌ద‌రు స‌మాచారం అందుకున్న పార్టీ కార్య‌క‌ర్త‌లు పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కు ఆ కుటుంబం ఇంటికి వైసీపీ స్టిక్క‌ర్ వేసేస్తార‌న్న మాట‌. అంటే వైసీపీ అంటేనే అల్లంత దూరంగా ప‌రుగులు పెడుతున్న టీడీపీ శ్రేణులు... వైసీపీ స్టిక్క‌ర్ క‌నిపించే ఏ ఇంటికి కూడా వెళ్ల‌లేవ‌న్న వాద‌న వినిపిస్తోంది. నిజంగానే ఈ కార్య‌క్ర‌మం పూర్తి అయితే... ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీకి ఎదురు గాలి వీయ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అంటే... వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యంతో చంద్ర‌బాబుకు చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయ‌మేన‌న్న మాట‌.
Tags:    

Similar News