పండుగ పూట ఈ ఇద్దరు తోపు వైసీపీ నేతలకు చేదు అనుభవం

Update: 2023-01-16 02:30 GMT
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని చెబుతారు. అలానే ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బలమైన నేతల మధ్య పొసగటం చాలా తక్కువగా ఉంటుంది. అందుకు వైసీపీ మినహాయింపేమీ కాదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అందునా ఒంగోలులో స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. టీడీపీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా అభిమానించే ఈ ఇద్దరు.. ఆయనకు అత్యంత సన్నిహితులు. వైవీ సుబ్బారెడ్డి అయితే దగ్గర బంధువు అన్న విషయం తెలిసిందే.

బాలినేని విషయానికి వస్తే.. జగన్ కష్టంలోనూ.. నష్టంలోనూ.. ప్రతి దశలోనూ ఆయన వెంట ఉంటూ ఆయనకు దన్నుగా నిలిచిన కొద్దిమంది నేతల్లో ఆయన ఒకరు. కొందరు వైసీపీ నేతల మాదిరి నోరు పారేసుకోకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే ఆయన్ను.. ప్రత్యర్థి పార్టీలోని వారు సైతం అభిమానిస్తుంటారు. గౌరవిస్తుంటారు. రాజకీయంగా సవాలచ్చ యవ్వారాలను ఉన్నప్పటికీ.. బాలినేని తొందరపడి మాట్లాడటం ఉండదు. అదే రీతిలో ఆయన్ను ఉద్దేశించి ఇతర పార్టీల నేతలు నోరు పారేసుకోవటం కనిపించదు.

అలాంటి బాలినేని.. వైవీ సుబ్బారెడ్డిల మధ్య పంచాయితీ మాత్రం ఒక పట్టాన తెగని పరిస్థితి. దీంతో.. తరచూ ఏదో ఒక రచ్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా.. సంక్రాంతిని పురస్కరించుకొని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిపై బాలినేని ఫోటోలతో పాటు.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను భారీ ఎత్తున ఉంచారు. దీనిపై బాలినేని వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ నేత ఉన్న ఫ్లెక్సీలపై సుబ్బారెడ్డి ఫోటోల్ని ఎలా ఉంచుతారంటూ ఫైర్ అయ్యారు. అధికారులకు సైతం ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.

దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది బాలినేని.. సుబ్బారెడ్డి ఫోటోలున్న ఫ్లెక్సీలను తొలగించారు.  రాత్రికి రాత్రి తొలగించిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తొలగించిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్యాలయంలో ఒక పక్కనగా పడేసిన వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారపక్షంలో ఉండి కూడా ఇంతటి అవమానమా? అన్న భావనలో వైవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఉన్నట్లు చెబుతున్నారు.

తమ నేత ఫోటోలున్న కారణంగానే బాలినేని వర్గం వారి ఒత్తిడితోనే ఇదంతా జరిగిందని వైవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. తొమ్మిదేళ్లుగా ఇరు వర్గాల మధ్య నడుస్తున్న రాజకీయ వైరం అంతకంతకూ ముదరటమే తప్పించి తగ్గని పరిస్థితి. తాజాగా ఫ్లెక్సీల తొలగించిన వైనం ఇరువురు నేతల మధ్య మరింత దూరం పెంచే అవకాశం ఉందని చెప్పక తప్పదు. పండుగ పూట కొత్త పంచాయితీకి ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయ కాకను రేపిన పరిస్థితి.
Tags:    

Similar News